నల్గొండలో ఈఎస్‌‌ఐసీ హాస్పిటల్కు అర్హత లేదు

నల్గొండలో  ఈఎస్‌‌ఐసీ హాస్పిటల్కు  అర్హత లేదు
  • లోక్‌‌సభలో  ఎంపీ రఘువీర్‌‌ ప్రశ్నకు కేంద్రం జవాబు 

న్యూఢిల్లీ, వెలుగు: నల్గొండలో ఈఎస్‌‌ఐసీ నిబంధనలకు తగ్గట్టుగా పెద్ద దవాఖాన ప్రతిపాదనకు అవసరమైన అర్హతలు లేవని కేంద్రం పేర్కొంది. నల్గొండలో 150 లేదా 200 పడకల ఈఎస్‌‌ఐసీ దవాఖాన ఏర్పాటు సాధ్యసాధ్యాలపై లోక్‌‌సభలో ఎంపీ కుందూరు రఘువీర్‌‌  లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్‌‌  మాండవీయ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 150 పడకల దవాఖానకు కనీసం ఒక లక్ష, 200 పడకల దవాఖానకు 1.5 లక్షల ఇన్షూర్డ్‌‌  పర్సన్స్‌‌ ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

 అలాగే 50 కి.మీ పరిధిలో మరో ఈఎస్‌‌ఐసీ దవాఖాన ఉండకూడదన్న నిబంధనలను గుర్తు చేశారు. నల్గొండ జిల్లాలో 2021–22లో 789, 2022–23లో 2,727, 2023–24లో 5,061 మంది మాత్రమే ఇన్షూర్డ్‌‌ పర్సన్స్‌‌  ఉన్నారని గణాంకాలను వెల్లడించారు. ప్రస్తుతం మిర్యాలగూడలోని ఒక ఈఎస్‌‌ఐఎస్‌‌  డిస్పెన్సరీ, ఐదు ప్రైవేటు టైఅప్‌‌  దవాఖానల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నట్టు సమాధానం ఇచ్చారు.