సీఎమ్మార్ ​పెండింగ్.. వడ్లు మాయం..సర్కారు ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లు

సీఎమ్మార్ ​పెండింగ్.. వడ్లు మాయం..సర్కారు ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లు
  • మంచిర్యాల జిల్లాలో బట్టబయలైన బాగోతం 
  • ఒక సీజన్​ వడ్లతో మరో సీజన్​లో సీఎమ్మార్
  • అక్రమ దందాతో కోట్లలో ఆర్జన 
  • ప్యాడీ టెండర్ ​ప్రక్రియతో మొదలైన టెన్షన్

మంచిర్యాల, వెలుగు : సర్కారు కస్టమ్ మిల్లింగ్ ​విధానం రైస్​మిల్లర్లకు వరంగా మారింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి సీఎమ్మార్​ కోసం అప్పగించిన వడ్లను అమ్ముకొని కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు. ఒక సీజన్ లో​వడ్లు అమ్ముకుంటున్న మిల్లర్లు మరో సీజన్​లో వచ్చిన వడ్లను మిల్లింగ్​ చేసి సీఎమ్మార్ ​పెడుతున్నారు. పెండింగ్ ​సీఎమ్మార్​ రికవరీ చేయడానికి ప్రభుత్వం గడువులు పొడిగించుకుంటూ పోవడం మిల్లర్లకు వరంలా మారింది. తాజాగా ప్యాడీ టెండర్​ప్రక్రియ కోసం ఇటీవల పలువురు వ్యాపారులు మంచిర్యాల జిల్లాలోని ఓ మిల్లును సందర్శించగా బాగోతం బట్టబయలైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్లలో టెన్షన్ మొదలైంది. 

పొంతనలేని లెక్కలు

గత యాసంగి, వానాకాలం సీజన్లలో రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి సేకరించి మిల్లుల్లో నిల్వ ఉంచిన ధాన్యంలో 25లక్షల టన్నులను వేలం వేయాలని ఇటీవల రాష్ట్ర సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ టెండర్లలో పాల్గొనాలని భావిస్తున్న కొందరు ఇతర రాష్ట్రాల వ్యాపారులు వడ్ల క్వాలిటీని పరిశీలించేందుకు వివిధ జిల్లాల్లోని రైసు మిల్లులను సందర్శిస్తుండగా, అక్రమాలు బయటపడ్తున్నాయి. ఉదాహరణకు మంచిర్యాల జిల్లాలో 2022–23 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సుమారు 1.60 లక్షల టన్నుల ప్యాడీ మిల్లుల్లో నిల్వ ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఆ మేరకు లేకపోవడంతో మిల్లర్లు పక్కదారి పట్టించారనే అనుమానాలు బలపడుతున్నాయి.

మంచిర్యాల జిల్లాలో సుమారు 20 వేల టన్నులకు టెండర్​ వేయాలని ఆఫీసర్లు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ టెండర్లలో పాల్గొనాలనే ఆసక్తితో ఏపీలోని రాజమండ్రి, మహారాష్ట్రలోని గోందియాకు చెందిన వ్యాపారులు ప్యాడీ క్వాలిటీని పరిశీలించేందుకు ఇటీవల జిల్లాకు వచ్చారు. సివిల్​సప్లయీస్​ సిబ్బందితో కలిసి హాజీపూర్​మండలం నర్సింగాపూర్​లోని ఓ మిల్లును సందర్శించగా అక్కడ రికార్డుల్లో చూపుతున్న దానికి, నిల్వలకు పొంతన కుదరలేదు. దీంతో మరోసారి రావాలంటూ వ్యాపారులను వెనక్కి పంపినట్టు సమాచారం. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారి నోటీస్​కు వెళ్లకుండా సివిల్​ సప్లయీస్​ ఆఫీసర్లు మేనేజ్​ చేసినట్టు 
తెలిసింది. 

కొన్ని మిల్లుల్లో ఇదీ పరిస్థితి..

నర్సింగాపూర్​లోని మిల్లుకు 2022–23 వానాకాలం సీజన్​లో 2,374 ​టన్నుల వడ్లు కేటాయించారు. 1,590 టన్నుల రైస్​కు కేవలం115  ​టన్నుల సీఎమ్మార్​ పెట్టారు. నిరుడు యాసంగి సీజన్​లో 2,868 టన్నుల వడ్లను అప్పగించగా, ఇంతవరకు సీఎమ్మార్ బోణీ చేయలేదు. మిల్లులో జాగా చాలకపోవడంతో భీమారం మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్​గోదాముల్లో వడ్లను నిల్వ ఉంచినట్టు చెప్తున్నా.. ఆ మేరకు అక్కడ ఉన్నాయో, లేదో తెలియని పరిస్థితి.

తాండూర్ ​మండలం రేచినిలోని మరో మిల్లులో ఉండాల్సిన దానికంటే తక్కువ నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. సదరు మిల్లుకు 2022–23 యాసంగి సీజన్​లో 2,164  టన్నుల వడ్లు ఇస్తే ఇప్పటికీ మిల్లింగ్​ స్టార్ట్​ చేయలేదు. వానాకాలం సీజన్​లో 2,627 ​టన్నుల ప్యాడీకి 1,760 టన్నుల రైస్​ఇవ్వాల్సి ఉండగా.. 114  టన్నులు మాత్రమే అందజేశారు. జిల్లాలోని మెజారిటీ మిల్లుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  

వడ్ల పైసలతో మిల్లర్ల వ్యాపారం

ప్రభుత్వం సీఎమ్మార్​ కోసం మిల్లర్లకు అప్పగించిన వడ్లను అమ్ముకొని ఆ పైసలతో వ్యాపారాలు చేసు కుంటున్నట్టు ఆరోపణలున్నాయి. వడ్లు క్వింటాలుకు రూ.2200 నుంచి రూ.2300కు, బియ్యం రూ.3వేల నుంచి రూ.3200కు మార్కెట్​లో అమ్ముకుంటున్నారు. ఒక సీజన్​కు సంబంధించిన వడ్లను అమ్ముకొని, మరో సీజన్​వడ్లు రాగానే మిల్లింగ్ ​చేసి సీఎమ్మార్ పెడుతున్నారు. ఇలా ఒక్కో మిల్లర్ ​సీజన్​కు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పైగాసొమ్ము చేసుకుంటున్నారు. రెండు మూడు సీజన్లకు సంబంధించిన సీఎమ్మార్ ​పెండింగ్​ ఉన్నప్పటికీ ప్రభుత్వం సీరియస్​ యాక్షన్​ తీసుకోకపోవడం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మిల్లర్లు సర్కారు వడ్లను అమ్ముకొని కోట్లలో లాభపడుతున్నారు. 

మంచిర్యాల జిల్లాలో లక్ష టన్నులకు పైగా పెండింగ్

మంచిర్యాల జిల్లాలో 2022–23 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి లక్ష ​టన్నులకు పైగా సీఎమ్మార్​ పెండింగ్​ ఉంది. వానాకాలం సీజన్​లో 54 మిల్లులకు 1,19,177  టన్నుల వడ్లను కేటాయించారు. 79,848 టన్నుల సీఎమ్మార్​కు 25,374 వేలు మాత్రమే అప్పగించారు. ఇంకా 54,474 టన్నులు పెండింగ్​ ఉంది. మిగతా 81,304 టన్నుల వడ్లలో మిల్లుల్లో ఎంత నిల్వ ఉందో అధికారులకే తెలియాలి. అలాగే, యాసంగి సీజన్​లో 27 రైస్​మిల్లులకు 82,859 టన్నుల వడ్లను కేటాయించారు. 56,344  ​టన్నుల సీఎమ్మార్​కు 8,521 టన్నులు మాత్రమే అందజేశారు. ఇంకా 47,824 టన్నులు బ్యాలెన్స్​ ఉంది. 74,548 టన్నుల వడ్లు మిల్లుల్లో నిల్వ ఉండాలి. కానీ, ఇందులో సగం కూడా లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి. 2021–22 వానాకాలం సీజన్​కు సంబంధించి 2,796  ​టన్నులు, యాసంగి సీజన్​కు సంబంధించి 14,859 టన్నుల సీఎమ్మార్​ పెండింగ్​ ఉంది.  

పర్యవేక్షణ ఏదీ? 

మంచిర్యాల జిల్లా సివిల్ సప్తయీస్​ ఆఫీసర్​గా పనిచేసిన ప్రేమ్​కుమార్ ​మూడు నెలల కిందట పెద్దపల్లి జిల్లాకు ట్రాన్స్​ఫర్​అయ్యారు. జిల్లాకు రెగ్యులర్​ డీసీఎస్​వోను కేటాయించకుండా ప్రేమ్​కుమార్​కే ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన పెద్దపల్లికే సమయం కేటాయిస్తూ మంచిర్యాలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అడిషనల్​కలెక్టర్(రెవెన్యూ) మోతీలాల్ కూడా కొత్తగా వచ్చారు.

ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే మిల్లర్లను గాడిలో పెట్టేందుకు యాక్షన్​ స్టార్ట్​ చేశారు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆయన ఎన్నికల వ్యవహారాల్లో బిజీ అయ్యారు. రెగ్యులర్​డీసీఎస్​వో లేకపోవడంతో సివిల్​ సప్లై పైనా, మిల్లర్ల పైనా పర్యవేక్షణ కొరవడింది. నెల రోజుల కిందట ఇతర జిల్లాలో పనిచేస్తున్న ఓ అధికారిని ఇక్కడికి ట్రాన్స్​ఫర్​ చేసినప్పటికీ ఆయన ఇంకా బాధ్యతలు తీసుకోలేదు.