జమ్ముకశ్మీర్‌కు అదనంగా 1800 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లు

జమ్ముకశ్మీర్‌కు అదనంగా 1800 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లు

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఇటీవల హిందూ కుటుంబాలపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత మరిన్ని బలగాలను మోహరించాలని కేంద్రం నిర్ణయించింది. కశ్మీర్​కు అదనంగా 20 కంపెనీల పారామిలటరీ బలగాలను పంపిస్తున్నట్లు సీఆర్​పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్)​ ప్రకటించింది. 1800 మందితో కూడిన ఈ బలగాలను ఎక్కువగా  పూంచ్,​రాజౌరీ జిల్లాలో మోహరించనున్నట్లు పేర్కొంది. 

రాజౌరిలోని డాంగ్రి గ్రామంలో ఈ నెల 1న ఉగ్రవాదులు పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.  ఆ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజునే  అదే జిల్లాలోని మరో గ్రామంలో ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి చిన్నారి సహా ఇద్దరు మరణించారు. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ఆచూకీ కోసం గత మూడు రోజులుగా భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి.ఉగ్రదాడులు జరిగిన వెంటనే సైన్యం, పోలీసులు. సీఆర్​పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ ను ప్రారంభించాయి.