
- మణిపూర్ అల్లర్లపై.. పార్లమెంట్లో మోదీ మాట్లాడాలె
- ఉభయ సభల్లో ప్రతిపక్షాల పట్టు రాజ్యసభలో ఆప్ సభ్యుల లొల్లి
- బయట ప్రకటనలు చేయడమేంటని మండిపాటు
- మూడో రోజూ చర్చ లేకుండానే వాయిదా పడ్డ ఉభయ సభలు
- గాంధీ విగ్రహం ముందు ఎంపీల పోటాపోటీ నిరసనలు
న్యూఢిల్లీ: మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ హౌస్‌లో ప్రకటన చేయాలంటూ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బయట మాట్లాడటం కాదని.. హౌస్లోకొచ్చి మాట్లాడాలంటూ మండిపడుతున్నాయి. దీంతో వరుసగా మూడో రోజు సోమవారం కూడా లోక్‌సభ, రాజ్యసభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకేతో పాటు పలు పార్టీల లీడర్లు మణిపూర్ అంశాన్ని లేవనెత్తారు. ‘ఇండియా ఫర్ మణిపూర్’, ‘మణిపూర్‌పై ప్రధాని ప్రకటన చేయాలి’ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. స్పీకర్ ఓం బిర్లా సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
రిప్లై ఎవరివ్వాలో మీరే చెప్తారా?: స్పీకర్
కాంగ్రెస్ లీడర్ అధిర్ రంజన్ చౌదరీని మాట్లాడాల్సిందిగా స్పీకర్ ఓం బిర్లా కోరారు. ‘‘మణిపూర్‌లో జరిగిన హింసాకాండపై మోదీ సభకు హాజరై ప్రకటన చేయాలి”అని డిమాండ్ చేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. ‘‘మణిపూర్ అంశంపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉంది. క్వశ్చన్ అవర్‌కు ఆటంకం కలిగించొద్దు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. క్వశ్చన్లకు ఎవరు సమాధానం చెప్పాలో మీరు నిర్ణయించడం సరికాదు”అంటూ రిప్లై ఇచ్చారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ప్రొసీడింగ్స్‌కు ఇబ్బంది కలిగించొద్దని కోరారు. ప్రతిపక్షాలు వినిపించుకోకపోవడంతో స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత రాజేంద్ర అగర్వాల్ సభను ప్రారంభించారు. అయినా, పరిస్థితి అలాగే ఉండటంతో మళ్లీ 2 గంటలకు వాయిదా వేశారు.
సభలోకొచ్చి ప్రకటన చేయాలి: మల్లికార్జున ఖర్గే
పార్లమెంట్ ఆవరణలో అధికార, ప్రతిపక్ష ఎంపీలు పోటాపోటీగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. ‘‘మణిపూర్ అంశంపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 140 కోట్ల మంది ప్రజా నాయకుడు (ప్రధాని మోదీ) పార్లమెంట్ బయట ప్రకటనలు చేస్తున్నారు. మోదీ సభకొచ్చి ప్రకటన చేసేదాకా నిరసనలు కొనసాగుతాయి” అని ఖర్గే స్పష్టం చేశారు. మణిపూర్ అల్లర్లు కంట్రోల్ చేయడంలో కేంద్రం విఫలమైందని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ అన్నారు. మహిళలపై దాడులు దేశం సిగ్గుపడాల్సిన అంశమని జేడీయూ లీడర్ లలన్ సింగ్ అన్నారు. పార్లమెంట్కొచ్చి మోదీ ప్రకటన చేయాలని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాలపై బీజేపీ విమర్శలు
ప్రతిపక్షాలే చర్చలకు సహకరించకుండా పారిపోతున్నాయని బీజేపీ లీడర్ సుధాన్షు విమర్శించారు. రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో జరుగుతున్న మహిళలపై మాట్లాడటం లేదని మండిపడ్డారు. రాజస్థాన్ సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై ప్రకటన చేశారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ చెప్పారు.
రాజ్యసభలోనూ వాయిదాల పర్వం
రాజ్యసభలోనూ వాయిదాల పర్వమే కొనసాగింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు మణిపూర్ అంశాన్ని లేవనెత్తారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. తర్వాత 12 గంటలకు తిరిగి ప్రారంభమవ్వగా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభకు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సభ్యులు నినాదాలు చేశారు. సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించొద్దని చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కోరినా వినిపించుకోలేదు. దీంతో సభ మరోమారు వాయిదా పడింది.
ప్రధాని సమక్షంలో చర్చ జరగాలె: ప్రతిపక్షాలు
2 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కూడా మణిపూర్ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని, సభలో మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్‌ఎస్ తదితర ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని సభ్యులు నిరసన కొనసాగించారు. తర్వాత సభ నుంచి వాకౌట్ చేయడంతో సమావేశాలను మంగళవారానికి వాయిదా వేశారు.
మోదీ ఎందుకు పారిపోతున్నారు: కాంగ్రెస్
మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ ప్రకటన చేయకపోవడంతోనే ఉభయ సభలు మళ్లీ మూడో రోజు వాయిదా పడ్డాయని కాంగ్రెస్ సీనియర్ లీడర్ జైరామ్ రమేశ్ అన్నారు. మణిపూర్, దేశ ప్రజల ఇబ్బందులపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని వివరించారు. చర్చ నుంచి మోదీ ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నారని జైరామ్ రమేశ్ ప్రశ్నించారు.
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సస్పెన్షన్
రాజ్యసభలో మంత్రి గజేంద్ర షెకావత్ మాట్లాడుతుండగా.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జంప్ చేసి చైర్మన్ వెల్‌లోకి దూసుకెళ్లారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మణిపూర్ అల్లర్లపై మోదీతో సభలో స్టేట్మెంట్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. పద్ధతి మార్చుకోవాలని సంజయ్ సింగ్‌కు చైర్మన్ సూచించినా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో సంజయ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలని రాజ్యసభ పక్ష నేత పీయూష్ గోయల్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మూజువాణీ ఓటింగ్ చేపట్టిన చైర్మన్.. సంజయ్ సింగ్‌ను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. అయితే, సంజయ్ సింగ్‌ను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకించాయి. సస్పెన్షన్ ఉప సంహరించు కోవాలని ప్రతిపక్ష సభ్యులు చైర్మన్‌ను కోరారు.
ప్రతిపక్షాలే పారిపోతున్నయ్: అమిత్ షా
మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన తర్వాత అమిత్ షా మాట్లాడారు. మణిపూర్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధమే అని ప్రకటించారు. చర్చకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. మణిపూర్ అల్లర్లు సున్నితమైన అంశమని, చర్చకు విపక్షాలు ఎందుకు సిద్ధంగా లేవో అర్థం కావడం లేదన్నారు. సభ విడిచి ఎందుకు వెళ్లిపోతున్నారో తెలియడం లేదని మండిపడ్డారు. కాగా, సోమవారం సభలో డీఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్లు, 2019ను ప్రభుత్వం వాపస్ తీసుకోగా.. నేషనల్ డెంటల్ కమిషన్ బిల్లు–2023, నేషనల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు–2023, రాజ్యాంగ(షెడ్యూల్డ్ కులాల) ఆర్డర్(సవరణ) బిల్లు–2023ని ప్రవేశపెట్టింది.