మద్యం పాలసీలో అక్రమాలు జరగలేదు

మద్యం పాలసీలో అక్రమాలు జరగలేదు

మద్యం పాలసీపై అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ అధికారులు మెరుపు దాడులు చేశారు. దాదాపు 15 గంటల పాటు సోదాలు నిర్వహించి కీలక ఆదారాలు సేకరించినట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే సీబీఐ దాడులు చేయిస్తుందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని..అవినీతికి పాల్పడలేదన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉండటమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. తనను అరెస్టు చేసి జైలుకు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేజ్రీవాల్ మేక్ ఇండియా నెంబర్ వన్  కార్యక్రమం ప్రారంభించిన రెండో రోజు సీబీఐ అధికారులు దాడులు చేశారని తెలిపారు. సామ దాన బేద దండోపాయాలను ఉపయోగించి ప్రభుత్వాలను ఏ విధంగా పడగొట్టాలని మోదీ ఆలోచిస్తుంటారని మండిపడ్డారు.  దేశం కోసం ప్రాణాలైన అర్పిస్తానని, అవసరమైతే జైలుకైనా వెళ్తానని డిప్యూటీ సీఎం చెప్పారు.  ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను చూసి కేంద్రం ఆందోళన చెందుతుందన్నారు. 

ఢిల్లీలో విద్యపై న్యూయార్క్ టైమ్స్ లో ప్రధాన శీర్షికగా వార్తను ప్రచురించడం దేశానికి గర్వకారణమని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో విద్యా ప్రమాణాలు ఈ స్థాయికి పెరగడం వెనక తన ప్రమేయం లేదని..కచ్చితంగా ఉపాధ్యాయుల కృషి ఫలితమేనని తెలిపారు. 

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డంకులు సృష్టించకపోతే నూతన మద్యం పాలసీ విధానం ద్వారా రాష్ట్రానికి ఏడాదికి రూ.10,000 కోట్లు ఆదాయం వచ్చేదన్నారు. ఎఫ్ఐఆర్ లో ఎక్కడ కూడా ఎంత అవినీతి జరిగిందో రాయలేదన్నారు. కేవలం సమాచారం ఆధారంగా చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. నూతన మద్యం పాలసీ విధానంలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. మద్యం పాలసీ విధానంపై అంత బాధగా ఉంటే గుజరాత్ లో రూ.10,000 కోట్ల  ఎక్సైజ్ చోరీ జరుగుతుందని..అలాంటి ప్రాంతాల్లో ఎందుకు సిబిఐ సోదాలు జరపడం లేదని కేజ్రీవాల్ ప్రశ్నించారు. 

సిసోడియాపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఆయన వెంటనే రాజీనామా చేయాలని తెలిపింది.షెల్ కంపెనీలకు మద్యం లైసెన్సులు అక్రమ పద్దతిలో మంజూరు చేయడంతో కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించింది. మద్యం పాలసీ అమలులో సిసోడియాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రంగంలోకి దిగారు. ఆగమేఘాల మీద 12మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం పాలసీ ఉల్లంఘనలపై కీలక సమాచారం సేకరించినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎంను నిందితుడిగా పేర్కొన్న కొన్ని గంటల తర్వాత ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15 మంది నిందితుల జాబితాలో సిసోడియా ప్రథమ స్థానంలో ఉన్నారు.