వ్యాక్సినేషన్ లో రాష్ట్రాలకు కేంద్రం కొత్త గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌

వ్యాక్సినేషన్ లో  రాష్ట్రాలకు కేంద్రం కొత్త గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌


న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ లో కీలకమైన మూడో దశకు చేరుకుంటున్న క్రమంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. థర్డ్ ఫేజ్ మొదలయ్యే లోపు మరిన్ని ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లను రిజిస్టర్ చేసేందుకు యుద్ధప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర జనాన్ని అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పింది. శనివారం కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్, కరోనాపై ఏర్పాటు చేసిన టెక్నాలజీ, డేట్ మేనేజ్ మంట్ ఎంపవర్డ్ గ్రూపు చైర్మన్ ఆర్ఎస్ శర్మ తదితరులు హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. వ్యాక్సినేషన్ పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త గైడ్​లైన్స్​ జారీ చేశారు.

ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేయండి

మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వాళ్లకు అందరి కీ వ్యాక్సిన్ వేస్తుండటంతో.. ప్రభుత్వ రీసెర్చ్ ఏజెన్సీలు, ప్రైవేటు సెక్టార్ సంస్థలతో ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటుచేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఫీల్డ్ హాస్పిటళ్లను నిర్మించేందుకు డీఆర్డీవో, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) వంటి ఏజెన్సీల సాయం తీసుకోవచ్చని చెప్పింది. ‘‘కొవిన్ యాప్ ఇప్పుడు స్టెబిలైజ్ అయింది. బాగా పని చేస్తోంది. మే 1 నుంచి మొదలయ్యే కొత్త ఫేజ్ వ్యాక్సినేషన్ కు రెడీ అయ్యింది’’ అని డాక్టర్ ఆర్ఎస్ శర్మ చెప్పారు.

మార్గదర్శకాలివీ..

  • ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే 18 నుంచి 45 ఏళ్ల లోపు వాళ్లకు వ్యాక్సిన్ వేయాలి. దీనిపై ప్రచారం చేయాలి. 
  • ప్రైవేటు హాస్పిటళ్లు, పారిశ్రామిక సంస్థలు, ఇండస్ట్రీ అసోసియేషన్ల హాస్పిటళ్లతో మాట్లాడి యుద్ధప్రాతిపదికన మరిన్ని అదనపు ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.
  • వ్యాక్సిన్లను తీసుకుంటున్న హాస్పిటళ్లు, వాటి దగ్గర ఉన్న స్టాక్, ధరలను కొవిన్ లో పెడుతున్నాయో లేదో మానిటర్ చేయాలి. 
  • కొవిన్ లో వ్యాక్సినేషన్ స్లాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
  • రాష్ట్రాలు, యూటీలు వ్యాక్సిన్ల కొనుగో లు నిర్ణయాలకు ప్రయారిటీ ఇవ్వాలి.