ఓటర్లను రెచ్చగొట్టొద్దు .. ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు: వికాస్​రాజ్

 ఓటర్లను రెచ్చగొట్టొద్దు .. ఏది పడితే అది మాట్లాడితే కఠిన చర్యలు: వికాస్​రాజ్
  • కేసీఆర్​కు నోటీసులు పంపినం.. వివరణ ఇచ్చేందుకు వారం గడువు కోరారు
  • 9,900 క్రిటికల్ ప్రాంతాలపై నిఘా పెట్టాం
  • ఆన్​లైన్​లోనూ నామినేషన్ వేయొచ్చు.. 
  • ఆ కాపీలు 24వ తేదీలోగా సమర్పించాలి
  • నేర చరిత్ర.. అభియోగాలను మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టాల్సిందే
  • 26 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిరంతర నిఘా కొనసాగుతుందని, ఎక్కడైనా.. ఎవరైనా ఏది పడితే అది మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్​(సీఈవో) వికాస్ రాజ్ హెచ్చరించారు. ప్రధానంగా హైద రాబాద్​తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మత చిచ్చు రేపే అవకాశం ఉన్నటువంటి కామెంట్లపై ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటున్నామని చెప్పారు.

గురువారం బీఆర్కే భవన్ లో వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. లీడర్లు మాట్లాడే భాష, తీరుపై నిరంతరం లైవ్, ఇతర మాధ్యమాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. 17 మంది సాధారణ పరిశీలకులు అన్నింటిని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9,900 పోలింగ్ కేంద్రాల పరిధిని క్రిటికల్ ప్రాంతాలుగా గుర్తించామని, ఆయా ప్రాంతాలో నిఘా పెట్టామని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ సిరిసిల్ల సభలో వాడిన భాషపై ఫిర్యాదు అందిందని.. దానికి ఈసీ నోటీసులు ఇచ్చామన్నారు. దీనిపై గురువారమే వివరణ ఇవ్వాల్సి ఉన్నదని.. అయితే వారం రోజుల సమయం ఇవ్వాలని కేసీఆర్ ఈసీని రిక్వెస్ట్ చేశారన్నారు. 

నామినేషన్ వేసినప్పటి నుంచి ఖర్చు లెక్కింపు

రాష్ట్రంలో 17 లోక్​సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ బై ఎలక్షన్ కు గురువారం నోటిఫికేషన్​ ఇచ్చామని, దీంతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని వికాస్​రాజ్ తెలిపారు. మొదటి రోజు 42 మంది అభ్యర్థులు వివిధ లోక్​సభ సెగ్మెంట్లకు 48 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని చెప్పారు. ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు.

ఆన్​లైన్​లోనూ నామినేషన్లు వేసుకునే వెసులుబాటు ఉన్నదని.. అయితే 24వ తేదీలోగా మాన్యువల్​గా కాపీలను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్లకు సమర్పించాలన్నారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ జాగ్రత్తగా నింపాలని సూచించారు. నామినేషన్‌‌‌‌ తోపాటు ఐదు ఫొటోలు ఇవ్వాలని చెప్పారు. పాత ఫొటోలు ఇవ్వకూడదనే ఈసీ రూల్స్​కు అనుగుణంగా ప్రస్తుతం ఓటర్లు గుర్తు పట్టే ఫొటోలు ఇవ్వాలని పేర్కొన్నారు. అఫిడవిట్‌‌‌‌లోని ప్రతి పేజీలో సంతకం చేయడంతో పాటు ప్రతి కాలమ్‌‌‌‌ నింపాల్సిందేనని స్పష్టం చేశారు.

అఫిడవిట్ అసంపూర్తిగా ఉంటే ఆ అభ్యర్థికి రిటర్నింగ్ అధికారి నోటీసు ఇస్తారని తెలిపారు. నామినేషన్ వేసినప్పటి నుంచి అభ్యర్థుల ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుందన్నారు. ఇప్పటికే 34 మంది వ్యయ పరిశీలకులు రాష్ట్రానికి వచ్చారన్నారు. అభ్యర్థులు కొత్త అకౌంట్​ను ఒపెన్ చేయాల్సి ఉంటుందని.. ఒకవేళ జాయింట్ అకౌంట్ పెట్టాలని అనుకుంటే ఏజెంట్ తో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్​చేయాలని సూచించారు. పార్టీలు ఇచ్చే బీ ఫామ్​లు రిట ర్నింగ్ అధికారులకే సమర్పించాలన్నారు.

26 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ

ఈనెల 26వ తేదీ నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ ఉంటుందని వికాస్ రాజ్ వెల్లడించారు. అదే సమయంలో పోలింగ్​ కేంద్రాల వివరాలకు ఆన్​లైన్ లింక్ కూడా ఉందని.. దాంతోనూ ఎక్కడ ఓటు వేసేది తెలుస్తుందన్నారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందని.. నామినేషన్ల ఉపసంహరణకు 29వ తేదీ వరకు గడువు ఉన్నట్లు వివరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మొత్తం తెలంగాణలోనే పట్టుబడిందని.. ఈసారి కూడా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.

19 ఏజెన్సీలు నగదు, లిక్కర్, గిఫ్ట్స్, డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై నిఘా పెట్టాయదని తెలిపారు. ఇప్పటి వరకు రూ.136 కోట్లు సీజ్ చేసినట్లు చెప్పారు. మొత్తం 160 కేంద్ర కంపెనీల బలగాలకు గాను 60 వచ్చాయని.. మరో వారం రోజుల్లో మిగతా 100 కంపెనీలు వస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 20 వేల మంది పోలీసులు వస్తారన్నారు. రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావం అంతగా లేదన్నారు. 2.79 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని చెప్పారు.