అప్పుల ఊబిలో సెస్.. 63 శాతం ఉచిత విద్యుత్ వే

అప్పుల ఊబిలో సెస్.. 63 శాతం ఉచిత విద్యుత్ వే
  • బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో పెండింగ్ లో రూ.622 కోట్ల బకాయిలు
  • పవర్‌ ‌లూమ్‌, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్ బిల్లులు కూడా పెండింగ్‌లోనే

రాజన్న సిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల సహకార విద్యుత్  సరఫరా సంస్థ (సెస్) అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రైతులకు ఇచ్చిన 24  గంటల ఉచిత విద్యుత్  సరఫరాకు సంబంధించిన బకాయిలను గత బీఆర్ఎస్ సర్కారు  ఏండ్లపాటు పెండింగ్ లో పెట్టింది. దీంతో సెస్ కు ఈ పరిస్థితి వచ్చింది. ఎన్పీడీసీఎల్ (నార్తన్  పవర్​ డిస్ట్రిబ్యూషన్​ కంపెనీ ఆఫ్  తెలంగాణ లిమిటెడ్​ ) నుంచి సిరిసిల్ల సహకార విద్యుత్  సరఫరా సంఘం కరెంట్ కొనుగోలు చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వినియోగదారులకు సరఫరా చేస్తోంది. అయితే రైతులకు సరఫరా చేసిన ఉచిత విద్యుత్ కు సంబంధించిన సబ్సిడీ బకాయిలను గత బీఆర్ఎస్  ప్రభుత్వం సెస్ కు రిలీజ్ చేయలేదు. దీంతో సెస్  రూ.400 కోట్లు ఎన్పీడీసీఎల్ కు బకాయి పడింది. వీటితో పాటు ఇతర విద్యుత్  సబ్సిడీలకు సంబంధించిన ఏరియర్స్  కూడా  9 ఏండ్ల పాటు సెస్ కు చెల్లించలేదు. అలాగే రూ.49 కోట్లు పవర్ లూమ్  ఆసాములకు, స్ట్రీట్ లైట్స్, వాటర్ సరఫరాకు సంబంధించి రూ.173 కోట్లు కలుపుకొని మొత్తం 622 కోట్లు ప్రభుత్వం నుంచి సెస్ కు రావాల్సి ఉంది. డొమెస్టిక్  వినియోగదారులవి రూ.61 కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయి. వినియోగదారులు నుంచి ఏటా వసూళ్లు పెరిగినా  ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్ లో ఉంటున్నాయి. దీంతో సెస్ లో  భారీగా బకాయిలు పేరుకుపోయాయి.

ఏడాదికి 100 కోట్ల నష్టంలో సెస్

ప్రతి సంవత్సరం సెస్ రూ.100 కోట్లు నష్టపోతోంది. సెస్  ఒక యూనిట్ విద్యుత్ ను రూ.4.84 పైసలకు ఎన్పీడీసీఎల్  నుంచి  కొనుగోలు చేస్తోంది. వినియోగదారునికి సప్లై చేసినప్పుడు యూనిట్ కు కనీసం రూ.6  వసూలు చేయాల్సి ఉన్నా రూ.4.86 పైసలు మాత్రమే వసూలు చేస్తున్నారు. దీంతో ఒక యూనిట్ కు రూ.1.14 పైసల నష్టం వస్తోంది. సంవత్సరానికి సెస్ 985 మిలియన్  యూనిట్లను  కొనుగోలు చేస్తుంది. ఇందులో 63 శాతం రైతుల కోసం వ్యవసాయానికి ఉచిత విద్యుత్  పథకం కింద సరఫరా చేస్తున్నారు. 28 శాతం విద్యుత్ ను వినియోగదారులకు మీటర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. మిగిలిన 9 శాతం కరెంట్ ను పరిశ్రమలకు అందిస్తున్నారు. మీటర్ల ద్వారా సరఫరా చేసే విద్యుత్  యూనిట్  ధర పెంచితే నష్టాలను కొంతమేరకు పూడ్చుకోవచ్చని సెస్ అధికారులు చెబుతున్నారు.

సామాన్యుడి మీదే బ్రహ్మస్త్రం

సెస్ లో పేరుకుపోయిన కరెంట్  బకాయిల్లో మొదట వసూలయ్యేవి డొమెస్టిక్  కన్య్జూమర్ ల విద్యుత్  బిల్లులు మాత్రమే. సామాన్య వినియోగదారులు విద్యుత్  బిల్లులు బకాయిలు ఉంటే సెస్ సిబ్బంది ఇంటింటికి పోయి కరెంట్ కట్ చేస్తున్నారు. కరెంట్ కట్ చేసినప్పుడల్లా వినియోగదారులు బిల్లులు చెల్లిస్తున్నారు. కానీ, కోట్లలో పేరుకుపోయిన ప్రభుత్వ బకాయిలు, ప్రభుత్వ కార్యాలయాల బకాయిలను మాత్రం అధికారులు వసూలు చేయలేకపోతున్నారు. కేవలం నోటీసులు ఇవ్వడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. సిరిసిల మున్సిపాలిటీ రూ.1.50 కోట్లు, వేములవాడ మున్సిపాలిటీ రూ.1.85 కోట్ల కరెంట్  బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ కార్యాయాలకు కరెంట్   కట్ చేస్తే కార్యకలాపాలు నిలిచిపోతాయని అధికారులు మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారు. అధికారులు నోటీసులు జారీ చేసినపుడు కొంత మొత్తంలో బిల్లులు వసూలవుతున్నాయి. మున్సిపాలీటీలకు రెగ్యులర్  ఆదాయం ఉన్నా విద్యుత్  బకాయిలు చెల్లించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

నోటీసులు జారీ చేస్తున్నాం

బకాయిలు ఉన్న వినియోగదారులకు నోటీసులు జారీ చేస్తున్నాం. సెస్ నుంచి ఎన్పీడీసీఎల్ కు చెల్లించాల్సిన బకాలు రూ.400 కోట్లు ఉన్నాయి. బకాయిలు చెల్లించాలని గత బీఆర్ఎస్  ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాం. పవర్ లూం, స్ట్రీట్ లైట్స్, ఇతర విద్యుత్  బిల్లులు కూడా పెండింగ్  ఉన్నాయి. త్వరలోనే ఏరియర్స్ ను వసూలు చేస్తాం.
- సూర్యచంద్రా రావు, సెస్ ఎండీ