తెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు: గుత్తా సుఖేందర్

తెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు: గుత్తా సుఖేందర్

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమంలో అస్సలు బీజేపీ పాత్ర లేదని మండిపడ్డారు. 

పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో తెలంగాణ ప్రజలపై ప్రధాని మోదీ మరోసారి విషం కక్కారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ గురించి అన్ని అబద్దాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటులో రక్తం ఎరులైపారిందన్న మోదీ.. ఎక్కడ ఎరులైపారిందో చెప్పాలని ప్రశ్నించారు. 2014 లో వచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని విషం కక్కుతూ మాట్లాడారని మండిపడ్డారు. ఎప్పుడైనా పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యేటప్పుడు డోర్ క్లోజ్ చేయడం ఆనవాయితీ.. దానిపై మాట్లాడడం సరైనది కాదని చెప్పారు. 

తుక్కుగూడ కాంగ్రెస్ సభలో సోనియా గాంధీ అబద్దాలు మాట్లాడిందని గుత్తా సుఖేందర్ చెప్పారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఆచరణకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ స్కీమ్స్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ తో మాత్రమే సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టిందని వ్యాఖ్యానించారు.

ALSO READ: హైదరాబాద్కు సరికొత్త అందం.. మంత్రి కేటీఆర్ ట్వీట్..

ఆచరణకు వీలు కానీ పథకాల హామీలు ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ కేవలం ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారన్నారు. ఎన్నికల కోసం మాట్లాడే మాటలు, పథకాలు తప్ప మరేమీ లేదని తెలిపారు. 1997 సంవత్సరంలో ఒక ఓటు రెండు రాష్టాలు అని కాకినాడలో బీజేపీ తీర్మానం ఏమైందని ప్రశ్నించారు. 

మహిళా బిల్లు గత 9 సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలేదని అడిగారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ వ్యతిరేకతను పోగొట్టుకోవడం కోసం కొత్త బిల్లులు తెస్తున్నారని తెలిపారు. అవినీతి సొమ్ము కక్కిస్తామని చెప్పిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై మాట్లాడాలని గుత్తా సుఖేందర్ అన్నారు.