Sharathulu Varthisthai Review: షరతులు వర్తిస్తాయి రివ్యూ..మధ్య తరగతి కుటుంబాల కథ

Sharathulu Varthisthai Review: షరతులు వర్తిస్తాయి రివ్యూ..మధ్య తరగతి కుటుంబాల కథ

టాలీవుడ్ యువ న‌టుడు చైతన్య రావు (Chaitanya Rao), భూమి శెట్టి (Bhumi Shetty) జంటగా కుమార స్వామి(Kumara Swamy) (అక్షర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’(Sharathulu Varthisthai). స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించిన ఈ చిత్రం ఇవాళ (మార్చి 15న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇది సామాన్యుల కథ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కథ అంటూ ప్రమోట్ చేస్తూ వచ్చిన చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథేంటంటే:

ఇష్టాలు..కష్టాలు..బాధలు..బంధాలు తెలిపే చిత్రం షరతులు వర్తిస్తాయి. మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు, కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు ఉంటాయి. అందుకే చాలా కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా ఉంటున్నాయి. అలా సామాన్య కుటుంబంలోని ఆలోచనలకు అద్దం పట్టేలా సినిమాను తెరకెక్కించారు. 

చిరంజీవి (చైతన్య రావు) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన సామాన్య యువకుడు. నీటిపారుదల శాఖలో క్లర్క్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒక మాములు మిడిల్ క్లాస్ వ్యక్తి. నాన్న చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను మొత్తం తానే చూసుకుంటాడు.క్లర్క్‌ ఉద్యోగం చేసుకుంటూ..చెల్లి, తమ్ముడిని చదివించడానికి నానావిధాలుగా కష్టపడుతుంటాడు. అతని స్కూల్‌మేట్‌ విజయశాంతి అలియాస్‌ విజయ శాంతి (భూమి శెట్టి)ని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తాడు. విజయశాంతి ఓ స్టేషనరీ షాప్ లో పనిచేస్తూ..ప్రేమించినందుకు అతని  కష్టకాలంలో సాయంగా ఉంటుంది. వీరిద్దరి మధ్య సాగే ప్రేమ మరింత ముందుకు వెళుతుంది. వీరి విషయం ఇంట్లో తెలియడంతో..వేరు కులాలు అయినా, విజయశాంతి తండ్రి ఒప్పుకోకపోయినా అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకుంటారు.

అలా సాఫీగా సాగిన వీరి జీవితంలోకి  చైన్‌ సిస్టమ్‌ బిజినెస్‌ వచ్చి సర్వ నాశనం చేస్తుంది.అందరికీ తెలిసే ఉంటుంది కదా..కొంత డబ్బు కట్టి మీ తరపున నలుగురిని జాయిన్‌ చేయిస్తే బోలెడు డబ్బు వస్తుందంటూ ఆశపెట్టి.. ఊరందిరితో డబ్బులు కట్టించే బ్యాచ్ ప్రతి ఊరి చుట్టూ ఉంటూనే ఉంటుంది. అలా ఈ సినిమాలో కూడా చూపించారు. ఆ ఏరియా లీడర్‌, వచ్చే ఎన్నికల్లో కార్పోరేటర్‌గా నిలబడాలనుకునే శంకరన్న..వారికి భరోసా ఇవ్వడంతో చాలా మంది..చైన్ సిస్టం కంపెనీకి డబ్బులు కట్టడమే కాకుండా వారి తరపును మరో నలుగురిని జాయిన్‌ చేయిస్తారు. 

ఇలాంటివి నమ్మని చిరంజీవికి ఎవ్వరు ఎంత చెప్పిన డబ్బులు కట్టడు. ఇక చిరంజీవి లేని టైములో అతనికి తెలియకుండా తన భార్య, తల్లి కూడా ఈ బిజినెస్‌ కోసం డబ్బులు కడతారు. ఆ కంపెనీ అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి తీరా రాత్రికి రాత్రి బోర్డు తిప్పేస్తుంది. దీంతో చిరంజీవి కుటుంబంతో పాటు ఆ ఏరియా వాసులంతా నడి రోడ్డు మీద పడుతారు.

అసలు ఆ భోగస్‌ కంపెనీ ఎవరిది? శంకరన్నని ముందు పెట్టి డబ్బులు వసూలు చేసింది ఎవరు? అంత డబ్బు పోవడంతో చిరంజీవి ఏం చేసాడు? భర్తకు తెలియకుండా డబ్బులు ఇచ్చి మోసపోయిన విజయశాంతి చివరకు ఏం చేసింది? కార్పోరేషన్‌ ఎన్నికలకు ఈ మోసానికి గల సంబంధం ఏమైనా ఉందా? అనేది తెరపై చూడాల్సిందే.

ఎలా సాగిందంటే:

ప‌ల్లెటూరి క‌థ..వారి ప్రేమలు..కుటుంబంలో నెలకొన్న సమస్యలను కళ్ళకు కట్టినట్లు చూపించారు. కరీంనగర్ జిల్లాలో ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన చిరంజీవి..తమ్ముడు..ఫోన్ ఇప్పియరాదు అన్న, చెల్లి..కోచింగ్ ఫీజు కట్టాలి అన్న..ఇలా కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకొని బ్ర‌తుకుతుంటాడు చిరంజీవి. అయితే అదే ప్రాంతానికి చెందిన విజయశాంతితో చిరంజీవి ప్రేమ‌లో ప‌డ‌టంతో ఫస్టాఫ్ అంత ఆసక్తికరంగా సాగుతుంది. 
 
ఇలాంటి మధ్యతరగతి వాళ్ళు అన్యాయంగా మోసానికి గురైతే.. అపుడు వారి పరిస్థితి ఏంటీ? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు కుమార్‌. ఇక మాయదారి చైన్ సిస్టం వల్ల మోసపోయిన ఆ కుటుంబాలు ఎలా బాధపడతాయి అనే కథాంశంతో ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించారు. ఇంటర్వెల్‌ సీన్‌ ఎమోషనల్‌గా ఉంటూనే సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది. 

ఇక సెకండాఫ్ లో కథనం నెమ్మదిగా సాగుతూ..ఒక పాయింట్‌ చుట్టే తిరుగుతున్నా ఫీలింగ్ వస్తోంది. పోయిన డబ్బులు ఎలా కట్టించారు. కార్పొరేటర్ ఎన్నికలు, హీరో ఏం చేసాడు అనే అంశంపై సాగుతుంది. అయితే ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఎమోషన్ ..సెకండ్ హాఫ్ లో అంత కనెక్ట్ అయ్యేలా ఉండదు. క్లైమాక్స్ చాలా సినిమాల్లో లాగే సోషల్ మీడియా వాడి చకచకా సీన్స్ వేసి, ఓ ట్విస్ట్ రివీల్ చేసి అయిపోయేలా చేశారు.

ఎవరెలా చేశారంటే.. 

మధ్యతరగతి యువకుడు చిరంజీవిగా  నటించిన చైతన్య రావు తన పాత్రలో ఒదిగిపోయాడు. తన డ్రెస్సింగ్ నుంచి తన డైలాగ్స్, ఎమోషన్ సీన్స్ లో గాని అద్భుతంగా నటించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకొని నడిపించాడని చెప్పుకోవొచ్చు. ప్రేమికురాలిగా, మిడిల్‌ క్లాస్‌ గృహిణిగా,భూమి శెట్టి మెప్పించింది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ,వారి మధ్య వచ్చే సీన్స్ బాగా వర్కౌట్‌ అయింది. మిగిలిన నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

టెక్నీషియన్స్:

ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ తెరపై చాలా నేచురల్‌గా కనిపించేలా చేశారు.సంగీతం ఆకట్టుకునేలా ఉంది. పాటలు బాగున్నాయి. సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ పనితనం పర్లేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.