విస్నూరు దొరల ఆగడాలపై పిడికిలెత్తిన జనం

విస్నూరు దొరల ఆగడాలపై పిడికిలెత్తిన జనం
  • బందగీ, కొమురయ్య, ఐలమ్మను కన్న నేల 

పాలకుర్తి, వెలుగు: ధిక్కార స్వరాల పురిటి గడ్డ పాలకుర్తి.. ఆధిపత్యం, అణచివేత మీద పిడికిలెత్తిన వీరభూమి.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, దొరల కుట్రలకు బలైన షేక్ బందగీ, విస్నూర్ దొర ఆగడాలకు వ్యతిరేకంగా పులిలా గర్జించిన వీర వనిత ఐలమ్మ, ఆత్మగౌరవం కోసం పోరాడిన కొన్నె పుల్లమ్మ, జీడి సోమనర్సయ్య, ఇంకా ఎందరో యోధులను కన్నగడ్డ పాలకుర్తి. సంఘం ఆధ్వర్యంలో 1946లో జులై4న విస్నూరులో జులూసు తీశారు. జులూస్ గడి  దగ్గరకు రాగానే తుపాకులు మోగాయి.  ముందు వరుసలో ఉన్న కొమురయ్య పొట్టలోకి తూటాలు దూసుకెళ్ళాయి. కొమురయ్య మరణం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది. జనగామ డివిజన్​లోని కామారెడ్డిగూడెం గ్రామానికి చెందిన షేక్​ బందగీ విస్నూర్ దేశ్​ముఖ్ దురాగాతాలపై న్యాయపోరాటానికి దిగాడు. తనకు రావాల్సిన భూమి కోసం దొరకు వ్యతిరేకంగా జనగామ కోర్టులో దావా వేశాడు. కేసును వాపసు తీసుకోవాలని దొర బెదిరించినా భయపడలేదు. బందగీ కేసు గెలుస్తాడని తెలుసుకున్న దొర1941 జులై17న తన గుండాలను పంపించి అతన్ని దారుణంగా హత్య చేయించాడు. వీరమరణం పొందిన బందగీ కేసు గెలిచాడు.

కుల వృత్తితో పూట గడవకపోవడంతో చాకలి ఐలమ్మ వ్యవసాయం చేయాలని భావించింది. భర్త నర్సయ్యతో కలిసి మల్లంపల్లి దొర కొండల్రావు దగ్గర భూమి కౌలుకు తీసుకుని సాగు మొదలు పెట్టింది. తక్కువ కులానికి చెందిన మహిళ వ్యవసాయం చేయడమేంటని ఆగ్రహించిన దొర రాంచంద్రారెడ్డి ఐలమ్మను అడుగడుగునా వేధించాడు. 1945లో ఐలమ్మ పండించిన ధాన్యాన్ని దోచుకునేందుకు గుండాలను పంపగా.. సంగం నాయకులు ఆమెకు అండగా నిలిచారు. గుండాలను వడిశెల రాళ్లతో తరిమి కొట్టి, ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. కోపంతో రగిలి పోయిన దొర ఐలమ్మ ఇల్లు లూటీ చేయించాడు. అయినా ఐలమ్మ వెన్నుచూపకుండా దొరలకు, నిజాంకు వ్యతిరేకంగా  పోరాడింది.