పాలమూరుపై కేసీఆర్‌‌‌‌వన్నీ అబద్ధాలే : చల్లా వంశీచందర్‌‌ రెడ్డి

పాలమూరుపై కేసీఆర్‌‌‌‌వన్నీ అబద్ధాలే : చల్లా వంశీచందర్‌‌ రెడ్డి
  • కమీషన్ల కోసం రాయలసీమ లిఫ్టుకు పర్మిషన్ ఇచ్చిండు: వంశీచంద్ రెడ్డి 
  • కుంగిన మేడిగడ్డను చూసేందుకు బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకొని వెళ్లారని ఫైర్​ 
  • కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యేలతో కర్వెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల సందర్శన
  • ప్రాజెక్టులో​ 30 శాతం పనులు కూడా పూర్తికాలే

జడ్చర్ల/పాలమూరు, వెలుగు: బీఆర్‌‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌‌ పాలమూరు రైతుల నోట్లో మట్టి కొట్టారని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచందర్‌‌ రెడ్డి ఫైర్‌‌ అయ్యారు. కమీషన్లకు కక్కుర్తి పడి ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్టుకు సహకరించి, దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చారని ఆరోపించారు. పాలమూరు– రంగారెడ్డి లిఫ్టు స్కీమ్‌ను ఎన్నికల హామీగా మార్చిన కేసీఆర్.. తొమ్మిదేండ్లలో 30 శాతం పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. 

పాలమూరు లిఫ్టు స్కీమ్‌లో భాగమైన కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను శుక్రవారం వంశీచంద్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జనంపల్లి అనిరుధ్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డి, పర్ణికా రెడ్డి, వాకాటి శ్రీహరి, యెన్నం శ్రీనివాస్​రెడ్డి, వీర్లపల్లి శంకర్‌‌తో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడారు. ‘‘పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ పనులు 80 శాతం పూర్తయ్యాయంటూ ఇటీవల నల్గొండ సభలో కేసీఆర్ చెప్పింది పచ్చి అబద్ధం. ముంపు రైతులకు నష్టపరిహారం చెల్లించలేదు. 

ఉదండాపూర్‌‌లోనే 500 ఎకరాల భూములకు పరిహారం చెల్లించాల్సి ఉంది. పాలమూరు లిఫ్ట్ పనులు నాసిరకంగా, అసంపూర్తిగా ఉన్నాయి. పాలమూరు లిఫ్ట్ పనులు పూర్తి చేయకుండా, ప్రాజెక్టుల వ్యయం పెంచుకుంటూ ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఉదండాపూర్‌‌, కర్వెనాలో కెనాల్ నిర్మాణాలు చేపట్టకుండా ఎన్నికల్లో ఓట్ల కోసం నార్లాపూర్ వద్ద ఒక పంపును ప్రారంభించి పాలమూరు లిఫ్ట్ పనులు పూర్తయినట్లు చెప్పుకున్నారు”అని వంశీచంద్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. 

అపెక్స్ కమిటీ మీటింగ్‌కు ఎందుకు పోలే.. 

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీ సమావేశానికి కేసీఆర్ అప్పట్లో గైర్హాజరు కావడం వల్లే కృష్ణా వాటర్‌‌లో మన వాటా మనకు దక్కలేదని వంశీచందర్ రెడ్డి ఆరోపించారు. ఇదే విషయమై తాను అప్పట్లో అప్పటి సీఎం కేసీఆర్‌‌కు లెటర్​ రాసినా కూడా ఆయన స్పందించ లేదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కింద 299 టీఎంసీలకే ఒప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వం గరిష్టంగా 212 టీఎంసీలను మాత్రమే వాడుకోగలిగిందని చెప్పారు. కాగా, షాద్‌నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి వద్ద నిర్మించాల్సిన రిజర్వాయర్‌‌కు సంబంధించి భూ సేకరణ కూడా చేయలేదన్నారు. 

కేసీఆర్​ ధనదాహానికి మేడిగడ్డ బలైంది..

కాళేశ్వరం అతిపెద్ద ఇంజినీరింగ్​అద్భుతమని, కేసీఆర్ పనితీరుకు ఆ ప్రాజెక్టు నిర్మాణమే నిదర్శనమని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు.. కుంగిన మేడిగడ్డ పిల్లర్లను చూసేందుకు ఏ ముఖం పెట్టుకుని వెళ్లారని వంశీచంద్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు ఆశపడి పనుల్లో క్వాలిటీపై అప్పటి బీఆర్ఎస్ సర్కారు దృష్టి పెట్టలేదని ఆరోపించారు. 

కేసీఆర్​ ధనదాహానికి మేడిగడ్డ బలైందని, మిగిలిన రిజర్వాయర్ల పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న ఆశతో ఆంధ్రా పాలకుల చేతిలో కీలుబొమ్మగా మారిన కేసీఆర్ సంగమేశ్వరం, రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణాలకు సహకరించారని ఆరోపించారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి మాట్లాడుతూ.. ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్మాణం, ముంపు భూములకు పరిహారం చెల్లింపు విషయంలో అక్రమాలు జరిగాయన్నారు. బీఆర్ఎస్‌ లీడర్లు కమీషన్లకు కక్కుర్తి పడి రైతుల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్ట్ అవినీతి, అక్రమాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని కోరారు.