Champions League T20: ఛాంపియన్స్ లీగ్ స్థానంలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్.. RCBతో పాటు ఆడే జట్లు ఏవంటే..?

Champions League T20: ఛాంపియన్స్ లీగ్ స్థానంలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్.. RCBతో పాటు ఆడే జట్లు ఏవంటే..?

ఛాంపియన్స్ లీగ్ టీ20.. 11 ఏళ్ళ క్రితం ఈ మెగా టోర్నీ చివరి సారిగా జరిగింది. క్రికెట్ ఆదరణ ఉన్న దేశాలు తమ దేశంలో ఒక డొమెస్టిక్ లీగ్ నిర్వహించుకుంటారు. ఆయా దేశాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లు చాంపియన్స్ లీగ్ కు అర్హత సాధిస్తాయి. 2009 నుంచి 2014 వరకు మొత్తం ఆరు సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించారు. అభిమానుల నుండి పెద్దగా ఆదరణ రాకపోవడంతో ఈ మెగా టోర్నీని నిలిపివేశారు.

ఇదిలా ఉంటే ఈ టోర్నీని 2026లో మరోసారి నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఛాంపియన్స్ లీగ్ స్థానంలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్ గా పేరు మార్చనున్నారు. ఈ ఫార్మాట్ పాత ఛాంపియన్స్ లీగ్ టీ20 మాదిరిగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్ర టీ20 లీగ్‌ల విజేతలు కొత్త టోర్నమెంట్‌లో ఆడతారు. ఇందులో ఐపీఎల్, ది హండ్రెడ్, బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్ లలో విజేతగా నిలిచిన జట్లు ఆడతాయి. జట్ల సంఖ్య లేదా ఏ లీగ్‌లు పాల్గొంటాయనే వివరాలు ఇంకా నిర్ధారించబడలేదు.

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ది హండ్రెడ్ విజేతను  పాల్గొనాలని కోరుకుంటుందని.. వైటాలిటీ టీ20 బ్లాస్ట్ విన్నర్స్ కు ఆ అవకాశం లేదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ ఆలోచనకు ఇప్పటికే ఈ ఈసీబీ, బీసీసీఐ నుండి మద్దతు లభిస్తోందని సమాచారం. ఐసీసీ చైర్మన్ జై షా కూడా ఈ ప్రణాళికకు అంగీకరించారట. 

2009 నుంచి 2014 వరకు మొత్తం ఆరు సార్లు ఈ మెగా టోర్నీని నిర్వహించారు. వీటిలో రెండు సార్లు చెన్నై సూపర్ కింగ్స్, రెండు సార్లు ముంబై ఇండియన్స్ విజేతలుగా నిలిచాయి. ఆస్ట్రేలియా జట్లు న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ సిక్సర్లు ఒక్కోసారి విజేతగా నిలిచాయి.చివరిసారిగా ఛాంపియన్స్ లీగ్ టీ20 ఫైనల్ ఐపీఎల్ జట్లు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ మధ్య జరిగింది. బెంగళూరులో జరిగిన ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. 

ఛాంపియన్స్ లీగ్‌లో ఇండియా నుండి మూడు జట్లు, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా నుండి రెండు జట్లు, పాకిస్తాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ నుండి ఒక జట్టు ఈ లీగ్ లో పాల్గొన్నాయి. ఈ సారి రూల్స్ ప్రకారం ఆ దేశాల్లో విజేతలుగా నిలిచిన జట్లు మాత్రమే ఈ సూపర్ లీగ్ ఆడనున్నట్టు తెలుస్తోంది.