గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీగా చాన్స్!

గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓడినా ఎమ్మెల్సీగా చాన్స్!

‘హైదరాబాద్​’ ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి  టీఆర్​ఎస్​ డైలమా
పోటీకి ముందుకు రాని లీడర్లు.. చివరకు పీవీ కూతురు వాణీదేవి పేరు ప్రకటన
ఈ ఎన్నికల్లో ఓడితే..  వేరే కోటాలో ఎమ్మెల్సీ సీటు, లేకపోతే రాజ్యసభ సీటు!

హైదరాబాద్, వెలుగుహైదరాబాద్-– రంగారెడ్డి –-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు టీఆర్​ఎస్​ వెనుకాముందాడింది. నెగెటివ్​ ఫీడ్​ బ్యాక్​ ఉందని, అసలు  గెలిచే చాన్స్ లేదని భావించి పార్టీ లీడర్లు బరిలో దిగేందుకు ముందుకు రాలేదు. వరంగల్– నల్గొండ– ఖమ్మం ఎమ్మెల్సీ  సీటుకు పోటీ చేసి, మరోచోట పోటీకి దూరంగా ఉంటే  పరువు పోతుందన్న అభిప్రాయాలు రావడంతో పార్టీ పెద్దలు డైలమాలో పడ్డారు. దీంతో చివరకు.. పార్టీకి సంబంధం లేని, అసలు పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేని వాణీదేవిని పోటీకి ఒప్పించినట్టు లీడర్లు చెప్తున్నారు. ఒకవేళ ఆమె ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే అసెంబ్లీ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీటన్నా, లేకపోతే రాజ్యసభ సీటన్నా ఇస్తామనే హామీని పార్టీ పెద్దలు ఇచ్చి ఉంటారని వారు అంటున్నారు. అందుకే నామినేషన్ల గడువుకు రెండు రోజుల ముందు వాణీదేవి పేరును ప్రకటించాల్సి వచ్చిందని చెప్తున్నారు.

వెంటాడుతున్న ఓటమి భయం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ దెబ్బతినడం, ఇంతవరకు ఎప్పుడూ ‘హైదరాబాద్​’ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానం నుంచి పార్టీ గెలవకపోడంతో అక్కడ పోటీకి టీఆర్​ఎస్​ భయపడిందని లీడర్లు చెప్తున్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, గతంలో పోటీ చేసి ఓడిపోయిన దేవీప్రసాద్ ను పోటీకి రెడీ కావాలని ప్రగతిభవన్ వర్గాలు అడిగినప్పుడు వారు ఆసక్తి చూపలేదని తెలిసింది. దీంతో అసలు పోటీకి దూరంగా ఉంటే ఎలా ఉంటుందనే కోణంలో కూడా పార్టీ పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం. చివరకు పరిస్థితులన్నీ అంచనా వేసుకొని.. పీవీ కూతురు వాణీదేవిని సీఎం కేసీఆర్ ఎంపిక చేశారని లీడర్లు అంటున్నారు.

ఒప్పించారు!

‘హైదరాబాద్​’ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసేందుకు పీవీ కూతురు వాణీదేవిని ఒప్పించడానికి ఎంపీ కె.కేశవరావు తీవ్రంగా కృషి చేసినట్టు టీఆర్​ఎస్​ లీడర్ల మధ్య చర్చ జరుగుతోంది. పీవీ మరణం తర్వాత ఆయన ఫ్యామిలీ కాంగ్రెస్​కి దూరంగా ఉందే తప్ప మరో పార్టీలో చేరలేదు. పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాత్రమే సీఎం కేసీఆర్ ఆ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చారు. ఆ మధ్య గవర్నర్  కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే చర్చ కూడా జరిగింది. అయితే.. ఇప్పుడు గ్రాడ్యుయేట్​ స్థానం నుంచి పోటీకి వాణీదేవిని బరిలోకి దింపారు. టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలనే ప్రతిపాదన రాగానే వాణీదేవి వెనుకడుగు వేసినట్లు పార్టీ లీడర్లు చెప్తున్నారు. అయితే.. ఒకవేళ ఈ ఎన్నికలో ఓడిపోతే త్వరలో ఖాళీ అయ్యే అసెంబ్లీ, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు వారు పేర్కొంటున్నారు. ఇదీ కుదరకపోతే వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

బీజేపీనే లక్ష్యమా?

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వరస విజయాలతో ఉన్న బీజేపీ, ‘హైదరాబాద్’ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించవద్దన్నదే టీఆర్​ఎస్​ వ్యూహమని లీడర్లు అంటున్నారు. ‘‘సొంత పార్టీ అభ్యర్థి ఓడినా ఫర్వాలేదు. కానీ బీజేపీ మాత్రం విజయం సాధించొద్దు ’’ అని హైదరాబాద్ కు చెందిన టీఆర్ఎస్​ లీడర్ పార్టీ వ్యూహాన్ని వివరించారు. అందుకే బీజేపీ అభ్యర్థి రామచందర్​రావు కమ్యూనిటీకి చెందిన వాణీదేవిని ఎంపిక చేశారని, దీంతో బ్రాహ్మణుల ఓట్లలో చీలిక వచ్చి బీజేపీ ఓడిపోతుందని గులాబీ లీడర్లు అంచనా వేస్తున్నారు.