అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్

 అంగళ్లు కేసులో చంద్రబాబుకు ఊరట.. ముందస్తు బెయిల్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబుకు అంగళ్లు కేసులో  ఊరట లభించింది.అంగళ్ల కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది.అంగళ్ల అల్లర్ల కేసులో A1గా ఉన్న చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయటంతో ఊరట లభించింది.

 గురువారం ( అక్టోబర్ 12) అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువైపుల వాదనలు విని తీర్పును వెలువరించకుండా రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం ( అక్టోబర్ 13) వెల్లడిస్తామని వెల్లడించింది. ఈక్రమంలో శుక్రవారం అయినా బెయిల్ వస్తుందా..? రాదా? అనే ఉత్కంఠకు ధర్మాసనం తీర్పుతో ఊరటనిచ్చింది.

 ఏపీలో సాగునీటి ప్రాజెక్టుల్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్ని సందర్శించేందుకు ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో పర్యటించారు. దీంట్లో భాగంగా అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటన సందర్భంగా అంగళ్లు మీదుగా వెళుతున్న సమయంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీకి చెందిన 179 మంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

ALSO READ : ఎలా ఉన్నారో : 30 రోజుల తర్వాత.. చంద్రబాబును చూడబోతున్న జనం..
 

దీంట్లో చంద్రబాబును  A1గా చేర్చారు. హత్యాయత్నంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పలువురికి బెయిల్ మంజూరు చేసింది. ఆ తరువాత మరికొంతమందికి కూడా ఊరటనిస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈక్రమంలో ఇదే కేసులో చంద్రబాబుకు కూడా హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో కాస్త ఊరట లభించినట్లైంది.