చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ కొత్త అప్ డేట్ ..

చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ కొత్త అప్ డేట్ ..

చంద్రుడిపై మన చంద్రయాన్-3  ల్యాండర్ విక్రమ్ దిగినప్పటి నుంచి రోజుకో కొత్త అప్ డేట్ వస్తోంది. తాజాగా  ( ఆగస్టు 27) అందించిన సమాచారంలో చంద్రుడి ఉపరితలంపై ఉండే ఉష్ణోగ్రతల వివరాలు వెల్లడయ్యాయి. విక్రమ్ ల్యాండర్‌‌లోని చంద్రాస్ సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్ పరిమెంట్ (ఛేస్ట్) పేలోడ్.. చంద్రుడి ఉపరిత ఉష్ణోగ్రతలను రికార్డ్ చేసింది. ఈ సమాచారం ద్వారా అక్కడి థర్మల్ బిహేవియర్‌‌ను మన ఇస్రో శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈమేరకు వివరాలతో ఇస్రో ఒక ట్వీట్ చేసింది.  ఛేస్ట్ పేలోడ్ అనేది కంట్రోల్డ్ పెనట్రేషన్ మెకానిజంతో పని చేస్తుందని తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై దాదాపు 10 సెంటీమీటర్ల లోతు వరకూ వెళ్లగలిగే కెపాసిటీ దీనికి ఉంటుందని పేర్కొంది.

చంద్రుడిపై విజయవంతంగా దిగిన చంద్రయాన్‌-3 మిషన్‌ ఇప్పుడు జాబిల్లి ఉపరితలంపై తన పరిశీలనను మొదలుపెట్టింది. చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతల పరిశీలన కోసం విక్రమ్‌ ల్యాండర్‌కు అమర్చి పంపిన పేలోడ్‌ ఈ పరిశీలన చేస్తున్నది. ఈ క్రమంలో ‘సీహెచ్ఏఎస్‌టీఈ’ పేలోడ్‌ తొలి పరిశీలనకు సంబంధించిన గ్రాఫ్‌ను ఇవాళ ఇస్రో ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇస్రో పంపిన ఆ గ్రాఫ్‌ ప్రకారం చంద్రుడి ఉపరితలం నుంచి లోతుకు వెళ్తున్నా కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు, పైకి వెళ్తున్నా కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. చంద్రుడి ఉపరితలంపై వివిధ లోతులలో ఉష్ణోగ్రతల్లో మార్పులను సూచిస్తున్నది. ఒక మాపనాన్ని లోతుకు పంపి చంద్రుడి దక్షిణ ధృవానికి సంబంధించిన ఉష్ణోగ్రత వివరాలను పరిశీలించడం ఇదే తొలిసారని, ఇంకా సమగ్ర పరిశీలన కొనసాగుతున్నదని ఇస్రో తెలిపింది.

ఛేస్ట్‌లో దాదాపు 10 టెంపరేచర్ సెన్సార్లు ఉంటాయని, అవే చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతల వివరాలను ఇస్రోకు చేరవేస్తాయని తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై ఒక్కో చోట ఒక్కో విధమైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఇస్రో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఓ మ్యాప్‌ని షేర్ చేసింది. లూనార్ సౌత్‌ పోల్ నుంచి ఇలాంటి ప్రొఫైల్ రావడం ఇదే తొలిసారి అని చెప్పింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత సుమారు 50 డిగ్రీలుగా ఉంది

 ఛేస్ట్ పేలోడ్‌ను తిరువనంతపురంలోని స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ, అహ్మదాబాద్‌లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సహకారంతో తయారు చేసినట్లు తెలిపింది. చంద్రయాన్-3లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయి. విక్రమ్ ల్యాండర్‌పైన 4, ప్రజ్ఞాన్ రోవర్‌పైన రెండు ఉన్నాయి. మరొకటి ప్రొపల్షన్ మాడ్యూల్ పేలోడ్. వీటిని వేర్వేరు శాస్త్రీయ పరిశోధనల కోసం రూపొందించారు.