
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు వైద్య సిబ్బంది. రాత్రి పగలు తేడా లేకుండా రోజుల తరబడి ఆసుపత్రుల్లోనే ఉంటూ వైరస్ సోకిన వారికి విశేష సేవలందిస్తున్నారు. ఈ పోరాటంలో బాధితులకు చికిత్స అందిస్తూ… కొందరు వైద్యులు మరణించారు కూడా. కొందరు చిన్న పిల్లలను సైతం ఇంట్లో వదిలేసి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా కరోనా బాధితుల సేవలో నిమగ్నమై జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లిని కూడా వాయిదా వేసుకుంది ఓ నర్స్.
చండీగఢ్‌లోని సెక్టార్ 49లో గల డిస్పెన్సరీలో పని చేస్తున్న నర్స్ షర్మిలా కుమారికి ఫిబ్రవరి 9 న నిశ్చితార్థం జరిగింది, అదే రోజున వివాహం తేదీ(.మే 1) కూడా నిర్ణయించబడింది. ఫిబ్రవరిలో పెళ్లి తేదీ ఖరారైన వెంటనే, ఇరు కుటుంబాలు పెళ్లి పనులు ప్రారంభించాయని, కాని దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడడంతో షాపింగ్ చేయలేకపోయామని ఆమె చెప్పింది. కరోనా కారణంగా ఏప్రిల్ 7 నుంచి తన విధులకు హాజరవుతున్నానని , పెళ్లి నాటికి కూడా లాక్డౌన్ ముగియకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో… వివాహాన్ని వాయిదా వేసుకున్నానని తెలిపింది.
“ప్రతీవారి జీవితంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైనది. అయితే దీనికన్నా దేశ సేవ ఎంతో ముఖ్యం. పెళ్లి తరవాతైనా చేసుకోవచ్చు. ముందు కరోనాని తరిమి కొట్టాలి. పెళ్లి కన్నా దేశ సేవ ఎంతో ముఖ్యం అని” యూనీఫామ్ ధరించి రోగుల సేవలో నిమగ్నమైంది షర్మిల. లాక్‌డౌన్ ముగిసిన తర్వాతనే పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పింది. ఇంత మంచి నిర్ణయం తీసుకున్న షర్మిలను తన కుటుంబం, బంధుమిత్రులు అభినందిస్తున్నారు.