టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనగానే .. నిరాడంబరంగా, సాదాసీదాగా ఉండే ఆయన రూపం కనిపిస్తుంది. చేతికి వాచీతో కానీ.. ఉంగరాలతో కానీ చంద్రబాబు ఎన్నడూ కనిపించలేదు. అలాంటిది తాజాగా ఆయన వేలికి ఓ ప్లాటినం ఉంగరం లాంటిది కనిపిస్తోంది. దాని గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో స్వయంగా చంద్రబాబే .. అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లెలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో ఆ ఉంగరం లాంటి దాని గురించి చెప్పారు.
‘‘నేను వేలికి వేసుకున్నది కేవలం ఉంగరం మాత్రమే కాదు. అందులో ఓ చిప్ ఉంది. అది నా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పు తెలియజేస్తుంది. నా హార్ట్ బీట్, స్లీపింగ్ అవర్స్, ఆహారం తదితర అంశాలన్నింటినీ రికార్డు చేస్తుంది. ఈ మొత్తం సమాచారాన్ని నా కంప్యూటర్‌కు పంపుతుంది’’ అని చంద్రబాబు చెప్పారు. ‘‘రోజూ నిద్ర లేచిన వెంటనే కంప్యూటర్‌లోకి ఈ ప్లాటినం ఉంగరం పంపిన రిపోర్ట్ ను చెక్ చేసుకుంటా. రోజువారీగా జరగాల్సిన చర్యల్లో ఏది తప్పుగా ఉందనే విషయాన్ని ఈ చిప్ ఇట్టే చెప్పేస్తుంది’’ అని పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలో ఏం తప్పు చేశానన్నది గ్రహించి.. మళ్లీ ఆ లోటుపాటు జరగకుండా అప్రమత్తంగా ఉంటానన్నారు.
