నా కాళ్లు ఎవరూ మొక్కొద్దు అలా చేస్తే నేనూ మీ కాళ్లు మొక్కుతా: చంద్రబాబు

నా కాళ్లు ఎవరూ మొక్కొద్దు అలా చేస్తే నేనూ మీ కాళ్లు మొక్కుతా: చంద్రబాబు

హైదరాబాద్, వెలుగు: తన కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని విడనాడాలని ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నేతలకు టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ కాదు కూడదని తన కాళ్లు ఎవరైనా మొక్కితే తిరిగి తానూ వాళ్ల కాళ్లు మొక్కుతానని స్పష్టం చేశారు. శనివారం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పబ్లిక్, పార్టీ కార్యకర్తలు వినతిపత్రాలు ఇస్తూ ఆయన కాళ్లు మొక్కారు. 

దాంతో చంద్రబాబు అసౌకర్యంగా ఫీలయ్యారు.  ‘నా కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దు. తల్లిదండ్రులు, గురువు, భగవంతుడి కాళ్లు మాత్రమే మొక్కాలి. నాయకుల కాళ్లకు ప్రజలు దండా లు పెట్టే విధానం వద్దు. ఈ రోజు నుంచి ఎవరూ అలా చేయవద్దు. ఈ దండం పెట్టే విధానానికి ఫుల్‌‌‌‌స్టాప్ పెడుతున్నా’ అని రాష్ట్ర ప్రజలకు సీఎం తెలిపారు. తనతో పాటు నాయకుల కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని తక్షణమే విడనాడాలని మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో  మంత్రులు అందుబాటులో ఉండాలని, రోజుకు కనీసం ఇద్దరు మంత్రులు అయినా ఉండాలని చంద్రబాబు కోరారు.