చంద్ర‌యాన్ నుంచి చంద్రుడి ఫొటోలు.. పెద్ద పెద్ద లోయ‌లు ఉన్నాయి...

చంద్ర‌యాన్ నుంచి చంద్రుడి ఫొటోలు.. పెద్ద పెద్ద లోయ‌లు ఉన్నాయి...

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తరుణం మరో అడుగు దూరంలోనే ఉంది. జాబిల్లిపై అడుగుపెట్టాలనే కోరిక ఎట్టకేలకు నిజం కాబోతోంది. దీంతో మరోసారి దేశం తన ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. మొత్తానికి ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రుడిపై ఈ నెల 23న చంద్రునిపై ల్యాండింగ్ కానున్న ఈ వ్యోమనౌక తాజాగా చంద్రుని అద్భుత చిత్రాలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించినప్పుడు చందమామ ఇలా కనిపిస్తోందంటూ ఇస్రో తాజాగా ట్విట్టర్‌లో ఓ రికార్డింగ్ వీడియోను, ఫొటోలను కూడా షేర్‌ చేసింది. ఈ చిత్రాల్లో చందమామ చాలా దగ్గరగా కనిపిస్తుండటం విశేషం. చందమామపై లోయలు, పర్వతాలు, గ్రహశకలాల దాడుల దృశ్యాలను కూడా ఈ చిత్రాల్లో చూడొచ్చు. ఈ వీడియోతో పాటు చంద్రయాన్ 3 ఇప్పుడు 1704, 313 కిలో మీటర్ల కక్ష్యను చేరుకున్నట్టు వెల్లడించింది. తదుపరి కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఆగస్టు 9న నిర్వహిస్తామని ఇస్రో ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఫొటోలను లునార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ సమయంలో తీసినట్టు తెలిపింది.

2019లో చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో విపత్కర పరిణామాలను ఎదుర్కొన్న చంద్రయాన్ 2 మిషన్ ఎవరూ ఊహించని విధంగా విఫలమైంది. ఈ క్రమంలో చంద్రయాన్ 3 ప్రయోగంపై దృష్టి సారించిన ఇస్రో.. ఆగస్టు 5న వ్యోమనౌక చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించినట్టు తెలిపింది. ఈ జీఎస్ఎల్వీ మార్క్ 3 హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ పై అమర్చిన అంతరిక్ష నౌక జూలై 14న ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా బయలుదేరింది. ఇలా చంద్రయాన్ 3 మరో 18 రోజుల పాటు ధీర్ఘ వృత్తాకార కక్ష్యల్లో చంద్రుడి చుట్టూ తిరుగుతూ 100 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరి.. చివరికి ఆగస్టు 23న సాయంత్రం 5గంటల 47నిమిషాలకు జాబిల్లిపై దిగనుంది.

దీంతో చంద్రుని ఉపరితలంపైకి తమ అంతరిక్ష నౌకను దింపిన దేశాల్లో యూఎస్, చైనా, రష్యాల తర్వాత భారతదేశం నాల్గో దేశంగా అవతరించింది. ఈ మిషన్ ఒక చాంద్రమాన రోజుగా పని చేస్తుంది. ఇది భూమిపై దాదాపు 14 రోజులకు సమానం. చంద్రునిపై ఒక రోజు భూమిపై 14 రోజులకు సమానం. ఇక చంద్రయాన్ 3 నిర్మాణ వ్యయం రూ.250 కోట్లు(లాంచ్ వెహికిల్ ఖర్చు మినహా). చంద్రయాన్ 3 జనవరి 2020లో ప్రారంభమైంది. అయితే దీన్ని మొదట 2021లో ప్రారంభించాలని అనున్నారు. కానీ కొవిడ్ 19 మహమ్మారి వల్ల మిషన్ స్టార్టింగ్ కు తీవ్ర జాప్యం ఏర్పడింది.