సిటీ వాతావరణంలో వింత మార్పులు

సిటీ వాతావరణంలో వింత మార్పులు

నైరుతి నిష్ర్కమణ, ద్రోణి ఎఫెక్ట్, క్లైమెట్ చేంజే కారణం.. జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో వింత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాల్లో వానలు పడితే దండిగా పడుతున్నాయి. హైదరాబాద్​లో అయితే అప్పుడే వర్షం పడుతోంది. ఆ వెంటనే ఎండ కొడుతున్నది. ఆదివారం అరగంటకోసారి ఉన్నట్టుండి వాన కురవగా.. కాసేపటికే మళ్లీ సాధారణ వాతావరణం కొనసాగింది. గంటల వ్యవధిలో ఇలా ఏడెనిమిది సార్లు జరిగింది. నైరుతి రుతు పవనాలు నిష్క్రమిస్తుండటంతో పాటు ద్రోణి ప్రభావం కూడా ఉండటం వల్లే ఇలా జరుగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 

అద్దగంటకోసారి వాన

రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులు ఇలానే ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్​లో అప్పటికప్పుడు కొద్దిపాటి మేఘాలు ఏర్పడటం.. 10–15 నిమిషాల పాటు వర్షం కురవడం మళ్లీ నార్మల్ అవ్వడానికి వాతావరణ మార్పు (క్లైమేట్ చేంజ్) కూడా కారణమని పేర్కొన్నారు. అయితే, జిల్లాల్లో లేని పరిస్థితి సిటీలో మాత్రమే ఎందుకు నెలకొందన్న విషయంపై ఆఫీసర్లు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ అప్పటికప్పుడు మోస్తరు వానలు పడ్డాయి. వికారాబాద్​జిల్లా పెద్దేముల్​లో 5.5 సెం.మీ., నాగర్ కర్నూల్​లో 3.25 సెం.మీ., సిద్ధిపేటలో 2.33 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక నైరుతి ఇప్పటికే మధ్య ప్రదేశ్​వరకు పూర్తి స్థాయిలో నిష్ర్కమించిందని ఐఎండీ ప్రకటించింది. రాష్ట్రం నుంచి నైరుతి రుతు పవనాలు ఈ వారంలో పూర్తిగా వెళ్లిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.