పైసల్లేంది పనిచేయట్లే! 

పైసల్లేంది పనిచేయట్లే! 
  •     భద్రాద్రికొత్తూగూడెం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో అస్తవ్యస్తంగా టౌన్​ ప్లానింగ్​ 
  •     తాజాగా లంచం తీసుకుంటూ పట్టుబడిన పాల్వంచ టౌన్​ ప్లానింగ్​ సూపర్​ వైజర్, మరో ఉద్యోగి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని మున్సిపాలిటీల్లో పైసల్లేంది పనులు కావట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బిల్డింగ్ ​పర్మిషన్ ​కావాలంటే మూముళ్లు ముట్టచెప్పాలిందే.. లేదంటే రోజులకొద్దీ మున్సిపాలిటీ చుట్టూ తిరగాల్సిందే. మున్సిపాలిటీల్లో టౌన్​ ప్లానింగ్​ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, పాల్వంచ మున్సిపాలిటీల్లోని టౌన్​ ప్లానింగ్​ విభాగంలో పనిచేస్తున్న వారిలో కొందరు ఏండ్ల తరబడి డిప్యూటేషన్లపై ఇక్కడి నుంచి ఇతర జిల్లాల్లో పనిచేస్తుంటే.. మరికొందరు ఇక్కడి మున్సిపాలిటీల్లోనే ఏండ్ల కాలంగా తిష్ట వేశారు. దీంతో టౌన్​ ప్లానింగ్​లో వారు చెప్పిందే వేదంగా మారింది. గురువారం పాల్వంచ మున్సిపాలిటీ టౌన్​ ప్లానింగ్​ విభాగంలో టీపీఎస్​గా పనిచేస్తున్న అధికారితో పాటు ఔట్ ​సోర్సింగ్​ ఉద్యోగి రూ.15 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడిన విషయం తెలిసిందే. 

ఖాళీగా పోస్టులు.. 

కొత్తగూడెం మున్సిపాలిటీలో టౌన్​ ప్లానింగ్ ​ఆఫీసర్ల పోస్టులు రెండు ఉండగా ఒక పోస్టు ఖాళీగా ఉంది. మరో పోస్టులో ఉన్న అధికారి మూడేండ్లుగా కొత్తగూడెం నుంచి ఖమ్మం కార్పొరేషన్​లో  డిప్యూటేషన్​పై అక్కడ పనిచేస్తున్నారు. టీపీబీవో పోస్టులు నాలుగుకు నాలుగు ఖాళీగా ఉన్నాయి. టౌన్​ ప్లానింగ్​ సూపర్​ వైజర్​ పోస్టులు రెండింటిలో ఒకటి ఖాళీగా ఉంది. ఇల్లెందు మున్సిపాలిటీలో ఇద్దరు టౌన్​ ప్లానింగ్​ సూపర్​ వైజర్లకు గానూ ఒకరు ఖమ్మం మున్సిపాలిటీలో డిప్యూటేషన్​పై విధులు నిర్వహిస్తున్నారు. మణుగూరు మున్సిపాలిటీలోనూ టౌన్​ ప్లానింగ్​ సూపర్​ వైజర్​ డిప్యూటేషన్​పై ఇతర ప్రాంతంలో డ్యూటీ చేస్తున్నారు. 

ఇష్టారాజ్యం.. 

జిల్లాలోని మున్సిపాలిటీల్లోని టౌన్​ ప్లానింగ్​ విభాగంలోని అధికారులు డిప్యూటేషన్లపై కొన్నేండ్లుగా ఇతర జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో పనిచేస్తుండడంతో ఇక్కడ ఉన్న వారిది ఇష్టారాజ్యంగా మారింది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని టౌన్​ ప్లానింగ్​ విభాగంలో పనిచేస్తున్న వారు కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి వర్క్స్​ చేసిన దాఖలాలున్నాయి. 

    పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో అక్రమ  నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలు అని మున్సిపల్​ అధికారులు ఫ్లెక్సీలు పెడుతారు.  కానీ ‘మామూళ్ల’తో కొద్ది రోజుల్లోనే ఆ ఫ్లెక్సీలు పెట్టిన చోట నిర్మాణాలు పూర్తవుతాయి. 

    కొత్తగూడెంలో 25కి పైగా అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్​, రెవెన్యూ అధికారులు ఒకటి రెండు రోజులు హడావుడి చేశారు. బిల్డింగ్​ నిర్మాణ దారులతో మాట్లాడుకున్నారు. దాంతో అక్రమ నిర్మాణాలన్నీ అధికారుల కళ్లముందే 
పూర్తయ్యాయి. 

    బస్టాండ్​ సెంటర్​లోని ఓ బిల్డింగ్​కు సెల్లార్​ పర్మిషన్​ లేదని టౌన్​ ప్లానింగ్​ అధికారులు స్పష్టం చేశారు. పనులు ఆపాలని చెప్పారు. చెప్పిన తెల్లవారి నుంచే పనులు సాగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. 

అడిగినంత ఇవ్వాల్సిందే... 

బిల్డింగ్​ నిర్మాణానికి పర్మిషన్స్​ విషయంలో టౌన్​ప్లానింగ్​ సిబ్బంది అడిగినంత ఇచ్చుకోకుంటే వారిని చెప్పులరిగేలా ఆఫీస్​ చుట్టూ తిప్పుకుంటారు. చివరకు విసుగు చెందిన సెటిల్​మెంట్​ చేసుకుని బిల్డింగ్​ నిర్మాణాలకు శ్రీకారం చుట్టే పరిస్థితి ఎక్కుగా ఉంటుందని పలువురు వాపోతున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలోని పెద్ద బజార్, చిన్న బజార్, లేపాక్షి రోడ్, ఎంజీరోడ్​లో ప్రధాన గల్లీలన్నీ ఆక్రమణలకు గురైనా టౌన్​ ప్లానింగ్​అధికారుల దృష్టిలో లేకపోవడం వారి పనితీరుకు అద్దం పడుతోంది.

అక్రమ నిర్మాణాలను పట్టించుకోవట్లే.. 

కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిసినా టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. 
- వై. కామేశ్, బీఎస్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ 

టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం 

టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. పెద్ద బజారు, చిన్న బజారు, లేపాక్షి రోడ్ నుంచి ఎంజీ రోడ్డు వరకు గల్లీలు ఆక్రమణల గురైన విధానంపై సర్వే చేపిస్తాం. పర్మిషన్ లేకుండా బిల్డింగ్ నిర్మాణాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. 
- శేషాంజన్​స్వామి, 
మున్సిపల్ కమిషనర్,  కొత్తగూడెం