
ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర ఏప్రిల్ 30 వ వతేది అక్షయ తృతీయ నుంచి ప్రారంభమవుతుంది. భక్తులు యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను సందర్శిస్తారు. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30 నుంచి, కేదార్‌నాథ్‌ను మే 2 నుంచి, బద్రీనాథ్‌ను మే 4 వ తేదీ వరకు భక్తుల కోసం తెరుస్తారు
చార్‌ధామ్‌లో నాలుగు ఆలయాలు ఉన్నాయి గంగోత్రి... యమునోత్రి... కేదార్‌నాథ్ .... బద్రీనాథ్. చార్‌ధామ్ తీర్థయాత్రకు వెళ్లే ప్రజలు తమ ప్రయాణాన్ని యమునోత్రి ఆలయాన్ని సందర్శించి ప్రారంభిస్తారు. హిందూ పురాణాల ప్రకారం యమరాజు సోదరి యమున . భైదూజ్ రోజున యమరాజు తన సోదరి యమునను కలవడానికి వెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ నదిలో స్నానం చేసే వారి పాపాలు తొలగి.. మోక్షం లభిస్తుందని యమరాజు తన సోదరి యమునను దీవించాడు. అందువల్ల యమునా నదిలో స్నానం చేసిన తర్వాత మాత్రమే చార్‌ధామ్‌ను ప్రారంభిస్తారు. ఈ నదిలో స్నానం చేస్తే చార్‌ధామ్ యాత్రలో ఎలాంటి అడ్డంకులు రావని నమ్ముతుంటారు.
యమునోత్రి: చార్ ధామ్ యాత్ర మొదలయ్యే ప్రథమ ఆలయం. దేవి యమునాదేవికి అంకితమైనది. దీనిని టెహ్రీ గర్హ్వాల్ మహారాజా ప్రతాప్ షా నిర్మించారు. ఇక్కడికి చేరుకోవాలంటే జానకి చట్టి నుంచి ఆలయానికి 6 కిలోమీటర్లు నడవాలి.
గంగోత్రి: గంగాదేవికి అంకితమైన ఆలయం. యాత్రలో రెండో దశలో వస్తుంది. ఈ ఆలయం 3 వేల 48 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
కేదారనాథ్: శివుడికి అంకితమైన పుణ్యక్షేత్రం. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయం హిమాలయ శిఖరాల మధ్యన 3 వేల 584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారు. ప్రస్తుతం ఉన్న దేవాలయ ఆకృతి ఆదిశంకరాచార్యులు వారు రూపొందించారు.
బద్రీనాథ్: చార్ ధామ్ యాత్రకు ముగింపు ఆలయం. విష్ణువుకు బద్రినారాయణ రూపంలో అంకితం. ఈ దేవాలయంలో వేద యుగం ( సత్య యుగం) 3.3 అడుగుల ఎత్తైన నల్లరాతి దేవత ఉంది. తొమ్మిదవ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని పునరుద్దరించారు. అయితే గర్భగుడిని మాత్రం అలానే ఉంచారు. హిందువులకు ఇది ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రదేశంగా విరాజిల్లుతోంది.