
చాట్‌జీపీటీ ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఓ మూగజీవి ప్రాణాలను రక్షించింది. డాక్టర్లు సైతం చేతులెత్తేయగా..చాట్ జీపీటీ లెటెస్ట్ వర్షెన్ జీపీటీ4 సాసీ అనే కుక్క ప్రాణాలను నిలబెట్టింది.
వివరాల్లోకి వెళ్తే..
ట్విటర్ యూజర్ కూపర్ పెంపుడు కుక్క సాసీకి..టిక్ బోర్న్ అనే వ్యాధి సోకింది. దీంతో కూపర్ సాసీని చికిత్స కోసం వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే సాసీకి రక్తహీనత ఏర్పడి అనారోగ్యం పాలైనట్లు డాక్టర్లు గుర్తించారు. చికిత్సతో ఆరోగ్యం సెట్ అయింది. కానీ కొన్ని రోజులకు మళ్లీ సాసీ ఆనారోగ్యం బారిన పడింది. కూపర్ మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లి టిక్-బోర్న్ పరీక్షలు చేయించాడు. రిపోర్ట్ నెగిటీవ్ వచ్చింది. కుక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందిన కూపర్కు ..కొన్ని రోజులు వేచి చూడాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఆ సలహా కూపర్‌కు నచ్చలేదు. మరో ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
ఈ సమయంలో చాట్ జీపీటీని కూపర్ ఆశ్రయించాడు. తన కుక్క సాసీ అనారోగ్య సమస్యను చాట్‌జీపీటీ-4కి వివరించాడు. తాను వెటర్నరీ డాక్టర్‌ను కాదంటు జీపీటీ సమాధానం ఇచ్చింది. అయితే కుక్కకి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ ను గమనించిన చాట్ జీపీటీ ..కుక్క ఎందుకు అనారోగ్యం పాలైందో వివరించింది. ఈ జబ్బుకు సంబంధించిన లక్షణాల గురించి చాట్‌జీపీటీ-4 కూపర్ కు డేటాను అందించింది. చాట్‌జీపీటీ చెప్పిన అనారోగ్య సమస్యలు సాసీలో ఉన్నాయని బదులిచ్చాడు. దీంతో సాసీ ఇమ్యూన్-మెడియేటెడ్ హెమోలిటిక్ అనీమియా అనే సమస్యతో బాధపడుతుందని వెల్లడించింది.
చాట్ జీపీటీ వివరాలతో మరోసారి సాసీని డాక్టర్ కు చూపించాడు కూపర్. సాసీకి ఐఎంహెచ్‌ఏ సమస్య ఉందా అని ప్రశ్నించాడు. దీంతో వైద్యులు రక్తపరీక్ష చేశారు. కుక్కకు ఐఎంహెచ్‌ఏ సమస్యతో ఇబ్బంది పడుతోందని రక్త పరీక్షల్లో తేలింది. అందుకే దాని ఆరోగ్యం క్షీణించిందని పేర్కొంది. ఆ తర్వాత దాని ప్రకారం ట్రీట్ మెంట్ చేయడంతో.. సాసీ ఆరోగ్యం కుదుట పడింది. ఈ విషయాన్ని కూపర్ వెల్లడించాడు. అంతేకాకుండా చాట్‌జీపీటీతో చేసిన చాటింగ్ ను స్క్రీన్ షాట్‌లు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్ అయ్యాయి.
టిక్ బోర్న్ అంటే..
టిక్ బోర్న్ అంటే కుక్కలకు సోకే జబ్బు. కుక్కల్లో పేలు బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవుల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. దీని వల్ల మూగజీవాల్లో ఆకలి లేకపోవడం.. శోషరస గ్రంథులు ఉబ్బడం, కీళ్ల వాపులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శరీరంలోని లోపలి భాగాల్లో రక్తస్త్రావం అవుతుంది. ఇది ముదిరితే మూగజీవాలు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.