సోనూసూద్ పేరుతో డబ్బులు వసూలు చేసిన ఛీటర్ అరెస్ట్

సోనూసూద్ పేరుతో డబ్బులు వసూలు చేసిన ఛీటర్ అరెస్ట్

హైదరాబాద్: రియల్ హీరో.. సినీనటుడు సోనూసూద్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్న బీహార్కు చెందిన ఆశిష్ కుమార్ (23)ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మోసగాడు సోనుసూద్  కార్పొరేట్ కార్యాలయం పేరుతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రకటనలు చేస్తున్నాడు. అందర్నీ నమ్మించేందుకు ట్విట్టర్లో సోనూసూద్ కార్పొరేట్ సంస్థ పేరు మీద అకౌంట్ తెరిచాడు. సోను సూద్ అంటే.. అందర్నీ ఆదుకునేవాడన్న అభిప్రాయం జనంలో ఉన్న నేపధ్యంలో అమాయకులు ఆశిష్ కుమార్ అకౌంట్ కు పెద్దఎత్తున విన్నపాలు పంపుతున్నారు. తమకు సాయం చేయాలని ఆశిస్తూ రిక్వెస్ట్ పెడుతున్న బాధితుల వివరాలను అందరికీ చూపిస్తూ... సోనూ సూద్ పేరు చెప్పి వ్యాపారస్తులు, ఉదార స్వభావం కల వారందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అతని అకౌంట్ పై అనుమానంతో సైబరాబాద్ పోలీసులు నిఘా పెట్టిన పోలీసులు మోసగాడిని గుర్తించారు. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ జిల్లా కు చెందిన ఆశిష్ కుమార్ అని నిర్ధారించుకున్నారు.  23 ఏళ్ల వయసున్న ఆశిష్ కుమార్ చిన్న చితక ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ.. తేరగా డబ్బు సంపాదించడం కోసం సోనుసూద్ పేరుతో మోసాలకు తెరలేపాడని గుర్తించారు, మోసగాడు అశిష్ కుమార్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.