చీటింగ్ అంటే ఇక 420 కాదు..318

చీటింగ్ అంటే ఇక 420 కాదు..318
  •  మర్డర్ కేసులకు ఐపీసీ 302 బదులు బీఎన్ఎస్ 103 
  • అత్యాచారానికి 376కి బదులు 64 కింద కేసు 
  • కొత్త చట్టాలతో  నేరాలకు సంబంధించిన సెక్షన్లలో మార్పులు

న్యూఢిల్లీ: భారతీయ శిక్షా స్మృతిలో  చేసిన మార్పుల వల్ల 420 అనగానే ఠక్కున గుర్తొచ్చే దొంగతనం, మోసం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ మారిపోయింది. ఇక మీదట చీటింగ్ కేసులకు పోలీసులు సెక్షన్ 420కి బదులు 318 సెక్షన్​ను ఉపయోగిస్తారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో 2024 జులై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 2023 చట్టం అమలులోకి వచ్చింది. దీంతో నేరాలు, వాటికి వేసే శిక్షలకు సంబంధించిన సెక్షన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. అనవసర సెక్షన్లు రద్దయ్యాయి. 

మరికొన్నింటిని సరళీకృతం చేయడంతో పాటు  ఒకే నిబంధనను తెలియజేసేవాటిని విలీనం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లో మొత్తం 511 సెక్షన్లు ఉండగా బీఎన్ఎస్ లో  358కి కుదించారు. సెక్షన్ 6 నుంచి 52 వరకు నిబంధనలు ఒకే విభాగం కిందకు వచ్చాయి. పద్దెనిమిది సెక్షన్‌లు ఇప్పటికే రద్దు కాగా..తూనికలు, కొలతలకు సంబంధించిన సెక్షన్లను లీగల్ మెట్రాలజీ చట్టం 2009 కింద కవర్ చేశారు. 

  వివాహానికి సంబంధించిన తప్పుడు వాగ్దానాలు, మైనర్‌లపై సామూహిక అత్యాచారం, మూకదాడులు, చైన్ స్నాచింగ్ వంటి కేసులకు ఇండియన్ పీనల్ కోడ్ లో ఇప్పటిదాకా నిబంధనలు లేవు. ఇప్పుడు వాటిని బీఎన్‌ఎస్‌ ద్వారా పరిష్కరించనున్నారు. ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకొని మోసం చేయటం వంటి కేసులకు కూడా కొత్త నిబంధన తెచ్చారు. 

కొత్తగా మారిన సెక్షన్లలో కొన్ని..

ఇప్పటిదాకా హత్యా నేరాలకు ఇండియన్ పీనల్ కోడ్‌లో 302 సెక్షన్ కింద నమోదు చేశారు. ఇక నుంచి బీఎన్ఎస్ లో 103 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేస్తారు. హత్యాయత్నం నేరానికి ఐపీసీ సెక్షన్ 307 ఉండగా.. బీఎన్ఎస్ లో సెక్షన్ 109 వాడనున్నారు. ప్రభుత్వ ఉద్యోగి డ్యూటీకి అడ్డుపడితే ఐపీసీ సెక్షన్ 353 బదులు బీఎన్ఎస్ సెక్షన్132 కింద కేసు బుక్ చేస్తారు. మహిళలపై లైంగిక వేధింపులకు ఐపీసీ 354  బదులు బీఎన్ఎస్ సెక్షన్ 75 కింద కేసు పెడతారు. అత్యాచారానికి ఐపీసీ 376 కి బదులు బీఎన్ఎస్ సెక్షన్ 64 కింద కేసు రిజిస్టర్ చేస్తారు. 

12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి ఐపీసీ సెక్షన్ 376 ఏబీ బదులు బీఎన్ఎస్ సెక్షన్ 65(2) ఉపయోగిస్తారు. గ్యాంగ్ రేప్ లకు ఐపీసీ సెక్షన్ 376డీ బదులు బీఎన్ఎస్ సెక్షన్ 70(1) కింద కేసు నమోదు చేస్తారు. ఫోర్జరీ నేరాలకు ఐపీసీ సెక్షన్ 465 బదులు.. బీఎన్ఎస్ సెక్షన్ 336(2) కింద కేసు పెడతారు. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్  డ్రైవింగ్ నేరానికి ఐపీసీ సెక్షన్ 279 బదులు  బీఎన్ఎస్ సెక్షన్ 281ద్వారా కేసు రిజిస్టర్ కానుంది. 

బెదిరింపులకు పాల్పడటం, పరువు నష్టం నేరాలకు ఐపీసీ సెక్షన్ 500, 506 బదులు.. బీఎన్ఎస్ సెక్షన్ 356(2), 351(2)(3)లను ఉపయోగిస్తారు. చిన్నారులతో పని చేయిస్తే గతంలో కనీసం 3 ఏండ్ల జైలు శిక్ష విధించేవారు. కానీ బీఎన్ఎస్ సెక్షన్ 95 ప్రకారం ఇక నుంచి పదేండ్ల వరకు జైలు శిక్ష, ఫైన్ విధించనున్నారు. చైన్ స్నాచింగులకు బీఎన్ఎస్ సెక్షన్ 304 కింద కేసు బుక్ చేస్తారు.