రైస్ పుల్లింగ్ లో లక్షకు పది లక్షలొస్తాయని ఆశచూపి..

రైస్ పుల్లింగ్ లో లక్షకు పది లక్షలొస్తాయని ఆశచూపి..
  • పలు రాష్ట్రాల్లో ఏజెంట్లను నియమించుకుని మోసాలు చేస్తున్న ముఠా
  • ఢిల్లీకి చెందిన సూత్రధారి సహా మరో నిందితుడి అరెస్టు
  • కర్నాటకకు చెందిన మరో నిందితుడు పరార్

కర్నూలు: రైస్ పుల్లింగ్ పేరిట అమాయక ప్రజలను మోసగిస్తున్న ఢిల్లికి చెందిన ప్రధాన నిందితుడు మరియు సూత్రధారి  సిధ్ధార్ద జైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతని ప్రధాన అనుచరునిగా వ్యవహరిస్తున్న జోగులాంబ గద్వాల్ జిల్లా మద్దూరు గ్రామానికి చెందిన షేక్  మున్నా అలియాస్ ఎస్.కె. మున్నా (32 ) కూడా పట్టుపడ్డాడు. అయితే కర్నాటక రాష్ట్రానికి చెందిన మరో ప్రధాన నిందితుడు పరార్ కావడంతో అతని కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. 
లక్షకు 10 లక్షలు లాభాలు వస్తాయని నమ్మించి మోసం   
రైస్ పుల్లింగ్ పేరిట మోసాలకు తెరలేపిన వ్యక్తి రాజస్థాన్ రాజధాని జైపూర్ కు చెందిన సిద్దార్థ జైన్ (41). ఢిల్లీలో నివాసం ఉంటూ రైస్ పుల్లింగ్ పేరిట అమాయకులను బురిడీ కొట్టడం ప్రారంభించాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు మహరాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా రాష్ట్రాలలో ఏజెంట్ల ను ఏర్పాటు చేసుకుని  రైస్ పుల్లింగ్ పేరిట మోసాలు చేస్తున్నాడు. డిల్లీ కి చెందిన యూనివర్సల్ ట్రేడ్ కంపెని అధినేత అయిన సిధ్దార్ద్ జైన్ తమ వద్ద రైస్ పుల్లింగ్  యంత్రం ఉందని దానిని రాకెట్ మరియు శాటి లైట్ లలో ఉపయోగిస్తారని దాని విలువ వెయ్యి కోట్లు ఉంటుందని, దాని పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 100 కోట్ల వరకు రుణం కూడా ఇస్తారని , ఆ రైస్ పుల్లింగ్ కోటి రూపాయలకు తమ వద్ద ఉందని , చూడాలంటే ఒక జాకెట్ కావాలని ఆ జాకెట్ విలువ 30 లక్షలు ఉంటుందని ఆ జాకెట్ వేసుకోకుండా రైస్ పుల్లింగ్ వద్దకు వెళితే రక్తం కక్కి చనిపోతారని చెప్పి ఆ రైస్ పుల్లింగ్ కు మహిమలు(శక్తులు) ఉన్నాయని పలు రకాలుగా నమ్మించేవాడు. తేలిగ్గా పదింతల డబ్బు వస్తుందనే ఆశతో వీరి వలకు చిక్కిన వారిని మోసం చేసి మొహం చాటేసేవారు. 
ఎలా బయటపడిందంటే..
కర్నూలు నగరంలోని వెంకటరమణకాలనీ సమీపంలోని బాలాజీనగర్ లో నివాసం ఉండే ఖాజా కోటి 25 లక్షలు, ఇదే కాలనీకి చెందిన పింజరి మాబాషా రూ.25 లక్షలు మోసపోయారు. జోగులాంబ గద్వాల జిల్లా మద్దూరు గ్రామానికి చెందిన షేక్ మున్నా ద్వారా కర్ణాటక , దావణగేరేకి చెందిన ఆదర్శ్ బసవ కలసి 2015 నుండి ఇప్పటివరకు  తన నుండి 3 కోట్ల 60 లక్షల వరకు వసూలు చేశారని,  మోసపోయాననే విషయాన్ని గ్రహించి ఫిర్యాదు చేశాడు. కర్నూలు మూడవ పట్టణ పోలీసుస్టేషన్ లో క్రైమ్ నెంబర్  174 / 2021 u/S 420 IPC and 506 IPC క్రింద  కేసు నమోదు చేయడం జరిగింది. తనతోటి బాధితుడైన బాలాజీనగర్ వాసి పింజరి మాబాషా కూడా తాను 25 లక్షలు మోసపోయానని ఫిర్యాదు చేశాడు. కర్నూలు నగరంలోని ఏలుకూరి బంగ్లా ఏరియాకు చెందిన  పి.శేకన్న  1 కోటి 80 లక్షలు  మోసపోయి ఫిర్యాదు చేయడంతో  కర్నూలు 4 వ పట్టణ పోలీసు స్టేషన్ లో  క్రైమ్ నెంబర్ 577 / 2021 U/sec…r/w 34 IPC క్రింద కేసు నమోదు చేశారు. 
పోలీసుల దర్యాప్తులో నిందితులు తమిళనాడు, కర్ణాటక, మహరాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల్లో పలువురు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని   మోసాలు చేస్తున్నారని గుర్తించారు. నిందితులపై నిఘా పెట్టిగాలిస్తూ..  కర్నూలు త్రీ టౌన్  ఎస్సై నరేంద్ర, హెడ్ కానిస్టేబుల్ బాలప్రసాద్ సింగ్,  కానిస్టేబుల్ కిశోర్, తిరుమలేష్  ప్రత్యేక బృందంగా  న్యూఢిల్లీకి వెళ్లి విచారించారు. అక్కడ వసంత్ కుంజ్ ప్రాంతంలో సూత్రధారి  సిద్దార్ద్ జైన్ కనిపించడంతో ఢిల్లీ పోలీసుల సహకారంతో నిందితుడు సిద్ధార్ధ జైన్ ను అదుపులోకి  తీసుకుని ట్రాన్సిట్ వారెంట్ పై కర్నూలు తీసుకువచ్చి విచారించారు. 
రైస్ పుల్లింగ్ యంత్రం ఉత్తిదే.. మోసపోయి అప్పులు తీర్చేందుకు..
రైస్ పుల్లింగ్ పేరిట మోసాలకు పాల్పడుతున్న సూత్రధారి సిద్ధార్ధ జైన్ దేశ వ్యాప్తంగా అతని చేసిన నేరాల గురించి అంగీకరించారు. అసలు రైస్ పుల్లింగ్ యంత్రం లేనే లేదని తేల్చి చెప్పాడు.  12 సంవత్సరాల క్రితం సిధ్దార్ధ జైన్ కూడా ఈ రైస్ పుల్లింగ్ అని నమ్మి పశ్చిమ బెంగాల్ కు వెళ్లి రూ. 25 లక్షలు  మోసపోయాడు. ఆ అప్పులు తీర్చేందుకు తాను కోటిశ్వరుడిలా సూట్ బూట్లు ధరించి బిల్డప్ ఇచ్చి.. తన వద్ద రైస్ పుల్లింగ్ యంత్రం ఉన్నట్లు నమ్మించి మోసాలకు పాల్పడే వాడని పోలీసుల విచారణలో తేలింది. తెలుగు రాష్ట్రాల్లో ఇతని ఏజెంట్  అయిన షేక్ మున్నాను కర్నూలు పట్టణం పరిధిలో అరెస్టు చేశారు. 
కర్ణాటక రాష్ట్రం దావణగెేరెకి చెందిన ఆదర్శ్ బసవ అనే నిందితుడు పరారయ్యాడు. అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అరెస్టయిన నిందితుల విషయం అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇస్తున్నామని కర్నూలు త్రీటౌన్ సీఐ తబ్రేజ్ వెల్లడించారు.  రైస్ పుల్లింగ్ అనే యంత్రం అసలు లేదని, దాని పేరుతో పలుచోట్ల మోసాలు జరుగుతున్నందున,  ఇలాంటి వాటి గురించి సమాచారం తెలిస్తే సంబంధిత పోలీసుస్టేషన్ లో తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.