పంచాయతీ బిల్లుల చెక్స్​ క్లియర్​ కావట్లే.. కార్మికుల నిరసన బాట

పంచాయతీ బిల్లుల చెక్స్​ క్లియర్​ కావట్లే.. కార్మికుల నిరసన బాట

కామారెడ్డి , వెలుగు:  గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు.  పంచాయతీల అకౌంట్లలో పైసలున్నప్పటికీ ప్రభుత్వం ఫండ్స్​ను ప్రీజింగ్​లో పెట్టడంతో ట్రెజరీకి పంపిన చెక్స్​క్లియర్​కావడం లేదు. జిల్లాలోని  చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో కార్మికులు నిరసన బాట పడుతున్నారు. జీతాలు చెల్లించాలని రెండు రోజుల కింద భిక్కనూర్​లో కార్మికులు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. 

 రూ. 20 కోట్ల మేర ఆగిన బిల్స్​ 

జిల్లాలో  526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మేజర్​పంచాయతీలు 20 ఉన్నాయి.  మిగతావి చిన్న పంచాయతీలు. ఒక్కో పంచాయతీకి  స్థానికంగా ఉన్న వనరుల లెక్కన  జనరల్ ఫండ్స్​ రూ. 2 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఇంటి పన్నులు, షాపుల కిరాయిలు, ఇండ్ల నిర్మాణం పర్మిషన్ , నల్లా ఫీజులు,  ట్రేడ్​లైసెన్సుల లాంటివి ఉన్నాయి.  స్థానికంగా కలెక్షన్​ చేసే (జనరల్ ఫండ్స్) ​తోనే  శానిటేషన్​, వాటర్​వర్క్స్​, ఎలక్ట్రీషియన్​వర్కర్స్​కు ప్రతి నెలా జీతాలు చెల్లించాలి.   

ట్రెజరీలోనే పెండింగ్​..

పంచాయతీ నుంచి ప్రతి నెలా బిల్స్, చెక్స్​ పంపినప్పటికీ ట్రెజరీలో క్లియర్​కావడం లేదు.  గవర్నమెంట్ ప్రీజింగ్​పెట్టడంతో చెల్లింపులు ఆగిపోయినట్లు సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఇద్దరు కార్మికుల నుంచి 30 మంది వరకు పని చేస్తున్నారు. శానిటేషన్​ కార్మికులు ఎక్కువగా  ఉంటారు.  ఒక్కొక్కరికి రూ.5వేల నుంచి రూ.12 వేల వరకు జీతాలు ఉన్నాయి. ఎక్కువ పంచాయతీల్లో  2 నెలలుగా, కొన్ని చోట్ల 3 నెలలుగా కార్మికులకు జీతాలు రావడం లేదు.  జిల్లా వ్యాప్తంగా రూ.20 కోట్ల మేర పంచాయతీ బిల్స్​ క్లియర్​ కాకుండా ట్రెజరీలోని ఆగిపోయినట్లు సర్పంచ్​లు, సెక్రటరీలు చెప్తున్నారు.  

మెయింటనెన్స్ ​కష్టమవుతోంది..

గ్రామాల్లో  ఇంటి పన్నులు, ఇతర పన్నులు వసూలు చేసి  పంచాయతీ అకౌంట్లలో జమ చేస్తారు.  కార్మికుల జీతాలు,  స్ర్టీట్​లైట్స్​ఏర్పాటు, ఇతరత్రా  మైనర్​పనులు జనరల్ ఫండ్స్​ నుంచి ఖర్చు చేసుకోవచ్చు. అయితే ఫండ్స్ ను​ప్రీజింగ్ లో​పెట్టడంతో  గవర్నమెంట్​గ్రాంట్స్​తో పాటు,  స్థానికంగా వసూలు చేసిన పైసలు కూడా ఖర్చు చేసుకొలేని పరిస్థితిలో ఉన్నామని సర్పంచ్​లు , సెక్రటరీలు వాపోతున్నారు.  కార్మికుల జీతాలతో పాటు  మోటార్ల రిపేర్​, స్థానికంగా చేపట్టిన డెవలప్​మెంట్స్​కు సంబంధించిన బిల్స్​ క్లియర్ కావడం లేదని చెప్తున్నారు. 

పూటగడవని కార్మికులు..

ఇచ్చే అతి తక్కువ జీతం అది కూడా  నెల నెలా రాకపోవడంతో కార్మికులు తిప్పలు పడుతున్నారు.  పూటగడవడం కూడా కష్టంగా ఉందని వాపోతున్నారు.  కొన్ని చోట్ల స్థానికంగా సెక్రటరీలు, సర్పంచ్​లు సర్దుబాటు చేసి ఇస్తున్నారు.  జీతాలు రాక కొందరు కార్మికులు అప్పులు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భిక్కనూరు పంచాయతీ కార్మికులు జీతాలు వస్తలేవని ఇటీవల భిక్షాటన చేసి నిరసన తెలిపారు.

‘ భిక్కనూరు పంచాయతీ పరిధిలో  వసూలు చేసిన ఆస్తి, నల్లా పన్నులు ఇతర గ్రాంట్స్​ ద్వారా వచ్చిన ఫండ్స్ మొత్తం  రూ. 77 లక్షల వరకు అకౌంట్​లో ఉన్నాయి. జీపీలో శానిటేషన్, వాటర్​వర్క్స్​కు సంబంధించి  28 మంది కార్మికులు పని చేస్తారు.  వారికి  ప్రతి నెలా రూ.2.20 లక్షల జీతాలు ఇవ్వాలి. 2022 డిసెంబర్,  2023 జనవరి నెలలకు సంబంధించి  రూ.2.20 లక్షల చొప్పున రెండు నెలల బిల్లుల చెక్కులను 5వ  తేదీ లోపే ట్రెజరీకి పంపారు. ప్రభుత్వం ఫండ్స్​ప్రీజింగ్​లో పెట్టడంతో చెక్స్​క్లియర్​కావడం లేదు.  కార్మికులకు రెండు నెలలుగా  జీతాలు రాలేదు.  దీంతో   జీతాలు రాక పూట గడవడం లేదని కార్మికులు ఆదివారం భిక్షాటన చేసి నిరసన తెలిపారు.’

‘  కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి పంచాయతీ అకౌంట్​లో రూ.8 లక్షల వరకు పైసలు ఉన్నాయి.  ఇక్కడ  కారోబార్​తో సహా 20 మంది కార్మికులు ఉన్నారు.  వీరికి ప్రతి నెల  రూ.లక్షా 48వేల జీతాలు చెల్లించాలి. 3 నెలలుగా జీతాల చెక్స్​క్లియర్​ కాలేదు. దీంతో పాటు మోటార్ల రిపేర్​, ఇతర వాటికి సంబంధించి రూ.1.5 లక్షలకు సంబంధించి మరో బిల్​ కూడా అగిపోయింది. ’

 వివరాలు కనుక్కుంటా

పంచాయతీ కార్మికులకు జీతాలు వస్తలేవన్న విషయం నాకు తెలియదు.  సంబంధిత వివరాలు కనుక్కుంటా. ఒక వేళ బిల్స్ పాస్ కాకపోతేనే  జీతాల చెల్లింపులు ఆపుతారు.  జీపీ సిబ్బందికి వెంటనే జీతాలు వచ్చేలా చూస్తా.
- శ్రీనివాస్​రావు,  డీపీవో, కామారెడ్డి