చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. విల్లాలో రూ.50 లక్షల బంగారం చోరీ

చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. విల్లాలో రూ.50 లక్షల బంగారం చోరీ
  • చెడ్డీ గ్యాంగ్ హల్ చల్.. విల్లాలో రూ.50 లక్షల బంగారం చోరీ
  • హైటెక్  సిటీలో  అర్ధరాత్రి విల్లాలోకి వెళ్లి ..
  • కిటికీ అద్దాలు పగలగొట్టి లోపలికి చొరబడి దొంగతనం
  • మియాపూర్​ పోలీస్​ స్టేషన్​పరిధిలో ఘటన

మాదాపూర్, వెలుగు:  హైటెక్​ సిటీలో చెడ్డీ గ్యాంగ్​ రెచ్చిపోయింది. అర్ధరాత్రి ఓ విల్లాలోకి కిటికీ గుండా చొరబడి బంగారు అభరణాలు చోరీ చేశారు. ఈ సంఘటన మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఈనెల 5న జరగగా ఆల్యసంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాకు చెందిన రామ్ సింగ్​ డాక్టర్. ఆయన తన భార్యాపిల్లలతో కలిసి మియాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని వసంత్​ విలాస్​లో విల్లా నంబర్​ 75లో నివాసం ఉంటున్నారు. కామారెడ్డి గవర్నమెంట్​ హాస్పిటల్​లో జనరల్​ సర్జన్​గా పనిచేస్తూనే హైదర్​నగర్​లో ఆయన ఓ హాస్పిటల్​ నిర్వహిస్తున్నారు. ఆయన భార్య కూడా డాక్టర్​గా పనిచేస్తున్నారు. ఈనెల 5న రామ్ సింగ్​ తన కుటుంబంతో కలిసి  రాత్రి 10 గంటలకు ఫంక్షన్​ కోసం కామారెడ్డికి వెళ్లి తిరిగి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. 

తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్లి చూస్తే బెడ్​రూంలోని బట్టలు చిందరవందరగా పడవేసి ఉండడం కనిపించింది. బంగారం కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. వెంటనే విల్లా చుట్టూ ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించగా, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.29 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ముఖానికి మాస్కులు ధరించి చెడ్డీలు వేసుకొని విల్లా వెనుకాల నుంచి కిటికీ అద్దాలు పగులగొట్టి ఇంట్లో చొరబడినట్లు కనిపించింది. బాధితులు వెంటనే మియాపూర్​ పోలీసులకు సమాచారం అందించారు. రూ.50 లక్షల విలువైన 30 తులాల బంగారం చోరీకి గురైందని రామ్  సింగ్​ ఫిర్యాదు చేశారు.​ ఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్​ పోలీసులు.. క్లూస్​ టీంతో వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మాదాపూర్​ ఎస్ఓటీ, సీసీఎస్, క్రైం బ్రాంచ్  పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దొంగల కోసం గాలిస్తున్నారు. ​