
అచ్చంపేట, వెలుగు: మంచినీటి సమస్యతో తిప్పలు పడుతున్నామని, తమ సమస్యను పరిష్కరించాలని లింగాల మండలం అప్పాపూర్, మల్లాపూర్ చెంచుపెంటల గిరిజనులు కోరారు. డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శుక్రవారం అప్పాపూర్ పెంటలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. గిరిజనులకు వివిధ చట్టాలపై డీఎల్ఎస్ఏ సెక్రటరీ నసీం సుల్తానా అవగాహన కల్పించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అప్పాపూర్, మల్లాపూర్ లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, హ్యాండ్ పంప్, మంచి నీటి బావులను ఏర్పాటు చేయాలని కోరారు. అప్పాపూర్ లో పీహెచ్సీ ఏర్పాటు చేస్తే చుట్టు పక్కల పెంటల్లోని గిరిజనులకు వైద్యం అందుతుందని చెప్పారు. ఆధార్, రేషన్ కార్డులు లేక పెన్షన్లు, సన్న బియ్యం అందడం లేదని వాపోయారు. సమస్యలను నెల రోజుల్లో పరిష్కరిస్తామని తహసీల్దార్ పాండు నాయక్ హామీ ఇచ్చారు.
అనంతరం గిరిజనులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, బాల్య వివాహాలు అరికట్టాలని సూచించారు. అనంతరం అచ్చంపేట పట్టణంలోని బాలసదన్ ను సందర్శించారు. అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ జి రవీందర్, ఎస్సై వెంకటేశ్వర్ గౌడ్, మన్ననూర్ ఎఫ్ఆర్వో దేవ్జా, తహసీల్దార్లు పాండు నాయక్, శైలేంద్ర కుమార్ పాల్గొన్నారు.