
ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందన్నది పెద్దలు చెప్పే మాట. విజయాల్లోనే కాదు, భర్తను మార్చడంలోనూ భార్య ముందుంటుందని చెన్నై మహిళ నిరూపించింది. కొర్రుకుపేట్‌లో ఉండే కమలకణ్నన్ (31) దొంగ. ఇప్పటివరకు 40 దొంగతనాలు చేశాడు. చాలాసార్లు జైలుకు కూడా పోయి వచ్చాడు. కానీ పెండ్లి చేసుకున్నాక భార్య కోసం దొంగతనాలు చేయనని నిర్ణయించుకున్నాడు. చోరీలు చేయనని పోలీస్ కమిషనర్‌కు లెటర్ కూడా ఇచ్చొచ్చాడు.
తాళాలు విరగ్గొట్టే ట్రైనింగ్ తీసుకొని..
2014లో పోరూర్ కన్‌స్ట్రక్షన్ ప్రాంతంలో ఓ మేస్త్రీని కమలకణ్నన్ కొట్టి తొలిసారి జైలుకెళ్లాడు. జైలు నుంచి వచ్చాక ఇల్లు కిరాయికి తీసుకోవడానికి జైల్లో కలిసిన పుఝల్‌ను డబ్బు సాయం కోరగా తను రూ. 13 వేలు ఇచ్చాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. మనోడు ఇచ్చిన సొమ్ము వేరే చోట దొంగతనం చేసింది. పోలీసులు వచ్చి కణ్నన్‌ను పట్టుకెళ్లారు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో 2015లో జైలు నుంచి బయటకొచ్చాక కణ్నన్ దొంగతనాల బాట పట్టాడు. తాళాలను ఎలా విరగ్గొట్టాలో వారం పాటు ట్రైనింగ్ తీసుకున్నాడు. తొలిసారి సెయింట్ థామస్ మౌంట్ ప్రాంతంలో నలుగురితో కలిసి ఓ ఇంట్లో దొంగతనం చేశాడు. మస్తు డబ్బులొచ్చాయి. ఇంకేముంది.. ఇంకొన్ని ఇండ్లను టార్గెట్ చేశాడు. దొంగతనాలు చేస్తున్న టైంలోనే కళ అనే మహిళను కణ్నన్ పెండ్లి చేసుకున్నాడు. భర్త దొంగతనాలు చేయడం నచ్చని భార్య.. మాన్పించాలనుకుంది. కష్టపడి భర్త మనసు మార్చింది. ఇక నుంచి ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తానని పోలీసులకు కణ్నన్ చెప్పాడు.ఇప్పుడు తనపై ఆధారపడిన భార్య ఉందని, అందుకే మారాలనుకుంటున్నానని కణ్నన్ చెప్పాడు.