ప్లే ఆఫ్స్‌కు ధోనీసేన

ప్లే ఆఫ్స్‌కు ధోనీసేన

షార్జా: అరబ్‌‌‌‌ గడ్డపై చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ జోరు కొనసాగుతోంది. సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ను చిత్తు చేసిన చెన్నై.. ఫేజ్‌‌‌‌2లో వరుసగా నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. అంతేకాక అందరికంటే ముందుగా ప్లే ఆఫ్స్‌‌‌‌ బెర్తు దక్కించుకుంది.  మరోపక్క లోస్కోరింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో చివరిదాకా పోరాడిన హైదరాబాద్‌‌‌‌ సీజన్‌‌‌‌లో తొమ్మిదో ఓటమి మూటగట్టుకుంది. దాంతో పాటు ప్లే ఆఫ్స్‌‌‌‌ రేస్‌‌‌‌ నుంచి అధికారికంగా నాకౌటైంది.  గురువారం  జరిగిన మ్యాచ్‌‌‌‌లో టాస్‌‌‌‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ చేసిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ 20 ఓవర్లలో  134/7 స్కోరు చేసింది. వృద్ధిమాన్‌‌‌‌ సాహా(46 బాల్స్‌‌‌‌లో 1 ఫోర్‌‌‌‌, 2 సిక్సర్లతో 44) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. చెన్నై బౌలర్లలో హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌(3/24) మూడు వికెట్లు తీయగా బ్రావో(2/17) రెండు వికెట్లు సాధించాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌లో చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 139 రన్స్‌‌‌‌ చేసి గెలిచింది. రుతురాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌(38 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45), డుప్లెసిస్‌‌‌‌(36 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 41) సత్తా చాటారు. హైదరాబాద్‌‌‌‌ బౌలర్లలో జేసన్‌‌‌‌ హోల్డర్‌‌‌‌(3/27) మూడు వికెట్లు తీశాడు. హేజిల్​వుడ్​కు ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు దక్కింది.

ఓపెనర్ల దూకుడు

చెన్నైకు ఛేజింగ్‌‌‌‌లో మంచి స్టార్ట్‌‌‌‌ దొరికింది. ఓపెనర్లు రుతురాజ్‌‌‌‌, డుప్లెసిస్‌‌‌‌  ఫస్ట్‌‌‌‌ వికెట్‌‌‌‌కు 75 రన్స్‌‌‌‌ జోడించారు. అయితే, 11వ ఓవర్‌‌‌‌లో రుతురాజ్‌‌‌‌ను ఔట్‌‌‌‌ చేసిన హోల్డర్‌‌‌‌..సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌కు బ్రేక్‌‌‌‌ ఇచ్చాడు. కానీ వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన మొయిన్‌‌‌‌ అలీ(17).. డుప్లెసిస్‌‌‌‌తో కలిసి జాగ్రత్తగా ఆడి లక్ష్యాన్ని కరిగించాడు. కానీ పది బాల్స్‌‌‌‌ తేడాలో చెన్నై మూడు వికెట్లు కోల్పోవడంతో హైడ్రామా నెలకొంది. అలీ,  రైనా(2), డుప్లెసిస్‌‌‌‌ స్వల్ప తేడాలో ఔటవ్వడంతో పుంజుకున్న హైదరాబాద్‌‌‌‌ బౌలర్లు చెన్నై బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కానీ, రాయుడు(17 నాటౌట్‌‌‌‌)తో కలిసి జాగ్రత్తగా ఆడిన ధోనీ(14 నాటౌట్‌‌‌‌) భారీ సిక్సర్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ కంప్లీట్‌‌‌‌ చేశాడు.

సాహా ఒంటరి పోరాటం..

గత మ్యాచ్‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌కు షాకిచ్చి ఎట్టకేలకు ఓ విజయం సాధించిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌..చెన్నైతో మ్యాచ్‌‌‌‌లో మళ్లీ అట్టర్‌‌‌‌ ఫ్లాప్‌‌‌‌ అయ్యింది.సీఎస్‌‌‌‌కే బౌలర్లంతా కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేయడంతో  సాహా మినహా ఇతర బ్యాటర్లు కనీస పోరాటపటిమ చూపలేకపోయారు. నెమ్మదిగా మొదలైన హైదరాబాద్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌కు మూడో ఓవర్‌‌‌‌లో సాహా ఊపు తెచ్చాడు. దీపక్​ చహర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో రెండు సిక్సర్లు కొట్టిన సాహా మంచి టచ్‌‌‌‌లో కనిపించాడు. కానీ లాస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ హీరో జేసన్‌‌‌‌ రాయ్‌‌‌‌(2)ను నాలుగో ఓవర్‌‌‌‌లో హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌ చేర్చాడు. ఇక, ఆ తర్వాత సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ప్లేయర్లు వరుస విరామాల్లో వికెట్లు ఇచ్చుకున్నారు. కెప్టెన్‌‌‌‌ విలియమ్సన్‌‌‌‌(11) నిరాశపర్చగా.. స్కోరు వేగం పడిపోయింది. దీంతో 10 ఓవర్లకు హైదరాబాద్‌‌‌‌ 63/2పై నిలిచింది.  11 బాల్స్‌‌‌‌ తేడాలో ప్రియమ్‌‌‌‌ గార్గ్‌‌‌‌(7), సాహా  ఔటవ్వగా.. అభిషేక్‌‌‌‌ శర్మ (18), అబ్దుల్‌‌‌‌ సమద్‌‌‌‌ (18) కలిసి 16వ ఓవర్‌‌‌‌లో జట్టు స్కోరు వంద దాటించారు. 17వ ఓవర్‌‌‌‌లో హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ వీరిద్దరని ఔట్‌‌‌‌ చెయ్యడంతో రైజర్స్‌‌‌‌ మరింత డీలా పడింది. హోల్డర్‌‌‌‌(5) ఫెయిలైనా.. చివర్లో రషీద్‌‌‌‌(17 నాటౌట్‌‌‌‌) మెరిపించడంతో రైజర్స్‌‌‌‌ ఓ మాదిరి స్కోరు చేసింది.
సంక్షిప్త స్కోర్లు: హైదరాబాద్‌‌‌‌:  20 ఓవర్లలో 136/7( సాహా 44, హేజిల్‌‌‌‌వుడ్‌‌‌‌ 3/24)
చెన్నై: 19.4 ఓవర్లలో 139/4 ( గైక్వాడ్‌‌‌‌ 45, డుప్లెసిస్‌‌‌‌ 41, హోల్డర్‌‌‌‌ 3/27)