
ఐపీఎల్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు మరో విజయాన్ని అందుకుంది. బుధవారం (మే 7) ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. భారీ ఛేజింగ్ లో యువ బ్యాటర్ బ్రేవీస్ (25 బంతుల్లో 52: 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తో పాటు దూబే కీలక ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై ఈ సీజన్ లో మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసి గెలిచింది.
180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఆయుష్ మాత్రే రెండో బంతికే డకౌటయ్యాడు. మొయిన్ అలీ మ్యాజికల్ డెలివరీతో కాన్వేను డకౌట్ చేశాడు. అయితే మరో ఎండ్ ఉర్విల్ పటేల్ మాత్రం బౌండరీలతో చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 11 బంతుల్లోనే 4 సిక్సర్లతో 31 పరుగులు చేసి ప్రమాదరకంగా మారుతున్న ఈ యువ బ్యాటర్ ను హర్షిత్ రాణా పెవిలియన్ కు పంపాడు.
అశ్విన్, జడేజా సైతం తక్కువ పరుగులే చేసి నిరాశపరిచారు. దీంతో పవర్ ప్లే లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఈ దశలో కేకేఆర్ విజయం ఖాయమనుకుంటే బ్రేవీస్ విధ్వంసం సృష్టించాడు. దూబేతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వైభవ్ అరోరా వేసిన 11 ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఓవర్ లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో ఏకంగా 30 పరుగులు రాబట్టి మ్యాచ్ ను చెన్నై వైపుకు మళ్ళించాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
►ALSO READ | ప్లే ఆఫ్ కు చేరే ముందు.. RCB కి బిగ్ షాక్.. IPL నుంచి స్టార్ ప్లేయర్ ఔట్
12 ఓవర్ తొలి బంతికి వరుణ్ చక్రవర్తి డేంజరస్ బ్రేవీస్ ను ఔట్ చేసి కోల్ కతాకు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. చివర్లో ధోనీ, దూబే జాగ్రత్తగా ఆడుతూ చెన్నైకి విజయాన్ని అందించారు. దూబే 42 పరుగులు చేసి ఔట్ కాగా.. ధోనీ 17 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా మూడు.. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. మొయిన్ అలీకి ఒక వికెట్ దక్కింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ సమిష్టిగా రాణించింది. ప్లే ఆఫ్స్ రేస్ కు చేరాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది. రహానే (48), రస్సెల్ (38), మనీష్ పాండే (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. రహానే (48) టాప్ స్కోరర్ గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, కంబోజ్ తలో వికెట్ తీసుకున్నారు.