
- బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా ఇసుక దందా
- కాంగ్రెస్ వచ్చాక పూర్తిగా కంట్రోల్
- కొత్త రీచ్లకు పర్మిషన్ ఇయ్యలే
చెన్నూర్, వెలుగు: మంత్రి వివేక్ వెంకటస్వామిపై బీఆర్ఎస్ లీడర్లు అసత్య ఆరోపణలు చేస్తే సహించేదిలేదని చెన్నూర్ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. బుధవారం చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నాయకులు హిమవంత్ రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా ఇసుక దందా నడిచిందని, కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఓవర్ లోడింగ్, జీరో దందా పూర్తిగా బంద్ అయ్యిందని పేర్కొన్నారు. కొల్లూరు గోదావరిలో ఎనిమిది ఇసుక రీచ్లకు అనుమతులు, పలుగుల రీచ్లకు ఎర్రాయిపేటలో అనుమతులుచ్చింది బీఆర్ఎస్హయాంలోనేని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఒక్క కొత్త రీచ్ కూడా పర్మిషన్ ఇయ్యలేదని స్పష్టం చేశారు. లారీల్లో నిర్ణీత పరిమితికి మించి ఒక్క కిలో ఇసుక ఎక్కువ ఉన్నా క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో వేలాల క్వారీని నామినేషన్ సిస్టంలో కాంట్రాక్టర్కు కట్టబెడితే.. కాంగ్రెస్ సర్కారు దాన్ని రద్దు చేసి ఈ మధ్యే టెండర్ పిలిచిందన్నారు. రాజా రమేశ్ కావాలనే మంత్రిని బద్నామ్ చేయడానికి ధర్నాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. టౌన్ ప్రెసిడెంట్ చెన్న సూర్యనారాయణ, మాజీ జడ్పీటీసీ బి.కర్ణసాగర్ రావు, భీమారం, కోటపెల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్ తివారీ, మోహన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రాజమల్ల గౌడ్, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, పి.శ్రీకాంత్, నాగరాజ్, చెన్న వెంకటేశ్, తిరుపతి రెడ్డి, ఇబ్రహీం, బషీర్ తదితరులు పాల్గొన్నారు.