కొలిక్కి వచ్చిన చెన్నూర్‌‌ ఎస్‌‌బీఐ గోల్డ్‌‌ స్కామ్‌‌

కొలిక్కి వచ్చిన చెన్నూర్‌‌ ఎస్‌‌బీఐ గోల్డ్‌‌ స్కామ్‌‌
  • 20.250 కిలోల బంగారాన్ని రికవరీ చేసిన పోలీసులు 
  • కోర్టులో డిపాజిట్‌‌ చేసి, బ్యాంకు ద్వారా కస్టమర్లకు అందజేసేందుకు ఏర్పాట్లు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూర్‌‌ ఎస్‌‌బీఐ 2 గోల్డ్‌‌స్కామ్‌‌ కేసు కొలిక్కి వచ్చింది. క్యాషియర్‌‌ రవీందర్‌‌ చోరీ చేసి, వివిధ సంస్థల్లో తాకట్టు పెట్టిన 20.250 కిలోల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. ఈ గోల్డ్‌‌ను కోర్టులో డిపాజిట్‌‌ చేసిన తర్వాత, తిరిగి ఎస్‌‌బీఐ ద్వారా కస్టమర్లకు అందజేయనున్నారు. రాష్ర్టంలోనే సంచలనం సృష్టించిన ఎస్‌‌బీఐ గోల్డ్‌‌ స్కామ్‌‌ కేసును పోలీసులు చాలెంజింగ్‌‌గా తీసుకున్నారు. 

గత నెల 21న స్కామ్‌‌ వెలుగులోకి రాగా.. మంచిర్యాల రీజినల్‌‌ మేనేజర్‌‌ రితేశ్‌‌ కుమార్‌‌ గుప్తా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.రామగుండం సీపీ అంబర్‌‌ కిశోర్‌‌ ఝూ, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్, జైపూర్‌‌ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బ్యాంక్‌‌ క్యాషియర్‌‌ రవీందరే ప్రధాన సూత్రధారి అని గుర్తించారు. మేనేజర్‌‌ మనోహర్, అసిస్టెంట్​లక్కాకుల సందీప్​సహకారంతో రవీందర్‌‌ 20.250 కిలోల బంగారం, రూ.1.10 కోట్లను చోరీ చేసి పలు గోల్డ్‌‌ సంస్థల్లో తాకట్టు పెట్టినట్లు గుర్తించారు. రవీందర్, మనోహర్, సందీప్‌‌తో పాటు అతడికి సహకరించిన మొత్తం 44 మందిని గత నెల 31న అరెస్ట్‌‌ చేశారు. 

అనంతరం మంచిర్యాల, చెన్నూరులోని పలు గోల్డో లోన్‌‌ సంస్థల్లో తాకట్టు పెట్టిన 20.250 కిలోల బంగారాన్ని రికవరీ చేశారు. కేసులో కీలకంగా వ్యవహరించిన సీఐలు బన్సీలాల్, వేణుచందర్, బాబురావు, ఎస్సైలు పి.సుబ్బారావు, శ్రీధర్, రాజేందర్, శ్వేత, సంతోశ్‌‌, లక్ష్మీప్రసన్న, కోటేశ్వర్, మధుసూదన్‌‌ను సీపీ అభినందించారు.