
పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ కేంద్రంతో కొట్లాడి సుమారు వంద కోట్ల అభివృద్ధి పనులకు నిధులు తీసుకొచ్చారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో అమృత్ పథకంలో భాగంగా స్వచ్ఛమైన నీరు అందించడానికి 30 కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మించబోతున్నామని చెప్పారు.
అటవీశాఖ అనుమతులు లేక నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఇదే విషయంపై మంత్రులతో చర్చించామన్నారు. వెంటనే చర్యలు తీసుకుని అన్ని పనులను పూర్తి చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే వివేక్.
ALSO READ | పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో.. నూతన రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తా: ఎంపీ వంశీకృష్ణ
వానాకాలం సీజన్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగా ఉన్నాయని చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలవ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీధుల్లో ఫాగింగ్ స్ప్రే చేయించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటిస్తూ జ్వరాల బారిన పడకుండా ఉండాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఒక గురుకుల పాఠశాలను ప్రభుత్వం మంజూరు చేసింది.. 25 ఎకరాల స్థలంలో త్వరలో గురుకుల పాఠశాల పనులను ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తుందన్నారు వివేక్ వెంకటస్వామి.
చెన్నూర్ నియోజకవర్గంలో ఆగస్టు31న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా జరగాల్సిన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వాతావరణం కారణంగా వాయిదా పడ్డాయని తెలిపారు వివేక్ వెంకటస్వామి.