క్రికెట్‌‌‌‌కు చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్.. ఆట బాగా స్లోగా ఉందని రెండేండ్ల కిందట వేటు

క్రికెట్‌‌‌‌కు చతేశ్వర్ పుజారా రిటైర్మెంట్.. ఆట బాగా స్లోగా ఉందని రెండేండ్ల కిందట వేటు

ఆర్భాటాలు లేవు, వీడియో సందేశాలు లేవు, కన్నీటి వీడ్కోలు ప్రసంగాలు లేవు. క్రికెట్‌‌‌‌లోని అత్యంత స్వచ్ఛమైన ఫార్మాట్‌‌‌‌ అయిన టెస్టులకు తన జీవితాన్ని అంకితం చేసిన ఇండియా వెటరన్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా  15 ఏండ్ల అద్భుతమైన కెరీర్‌‌‌‌కు నిశ్శబ్దంగా వీడ్కోలు పలికాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత నిఖార్సైన టెస్టు ఆటగాడిగా పేరుగాంచిన పుజారా, ప్రశాంతతకు, నిరాడంబరతకు మారు పేరుగా నిలిచాడు. క్రీజులో గంటల తరబడి ఓపికగా బ్యాటింగ్ చేసినట్లే, తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని కూడా ఎటువంటి హడావుడి లేకుండా వెల్లడించాడు. తన కెరీర్‌‌‌‌లో వేగంగా ఆడటం లేదన్న విమర్శలను, గాయాల బాధలను లెక్క చేయని పుజారా ఎప్పుడూ జట్టు  విజయం కోసమే తపించాడు. ఎన్నడూ  రికార్డుల కోసం పరుగులు పెట్టని చతేశ్వర్‌‌‌‌‌‌‌‌  నిజాయితీ, అంకితభావంతో టెస్టులపై చెరగని ముద్ర వేశాడు. క్రికెట్ ప్రపంచానికి పట్టుదల, క్రమశిక్షణ, సహనం వంటి విలువలను నిశ్శబ్దంగా నేర్పించిన ఈ గొప్ప పోరాట యోధుడు  ఆట నుంచి తప్పుకున్నా.. టెస్ట్ క్రికెట్‌‌‌‌పై అతను వేసిన ముద్ర మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది.

న్యూఢిల్లీ: ఇండియా టెస్టు క్రికెట్‌‌‌‌లో ఒక గొప్ప అధ్యాయం ముగిసింది. లెజెండరీ క్రికెటర్ రాహుల్‌‌‌‌ ద్రవిడ్ తర్వాత  ఒక దశాబ్దానికి పైగా టెస్ట్  ఫార్మాట్‌‌‌‌కు వెన్నెముకగా నిలిచిన ‘మరో వాల్’ చతేశ్వర్ పుజారా తన అద్భుతమైన కెరీర్‌‌‌‌కు ముగింపు పలికాడు.  అన్ని రకాల ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. 2023లో తన చివరి టెస్టు ఆడిన 37 ఏండ్ల పుజారా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశాడు. ‘రాజ్‌‌‌‌కోట్‌‌‌‌లోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన నేను, నా తల్లిదండ్రులతో కలిసి ఇండియా క్రికెట్ జట్టులో భాగం కావాలని కలలు కన్నాను. ఈ ఆట నాకు ఇంత గొప్ప అవకాశాలు, అనుభవాలు, ప్రేమను అందిస్తుందని అప్పుడు నేను ఊహించలేదు.

ముఖ్యంగా నా రాష్ట్రానికి,  దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించింది. ఇండియా జెర్సీ ధరించడం, జాతీయ గీతం ఆలపించడం, మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ నా అత్యుత్తమం ఇవ్వడానికి ప్రయత్నించడం.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. కానీ, ప్రతీ మంచి విషయానికి ఒక ముగింపు ఉంటుంది. అందుకే, ఎంతో కృతజ్ఞతతో ఇండియా క్రికెట్‌‌‌‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని పుజారా పేర్కొన్నాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో 103 టెస్టు మ్యాచ్‌‌‌‌లు ఆడిన పుజారా 43.60 సగటుతో 7195 రన్స్ సాధించాడు.

ఇందులో 19 సెంచరీలు, 35 ఫిఫ్టీలు ఉన్నాయి. టెస్టుల్లో ఇండియా తరఫున అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్ల లిస్ట్‌‌‌‌లో తను 8వ ప్లేస్‌‌‌‌లో  ఉన్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్‌‌‌‌లో అతను 21,301 రన్స్ సాధించడం విశేషం. తన రిటైర్మెంట్ సందేశంలో పుజారా.. బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్, తన గురువులు, కోచ్‌‌‌‌లు, తోటి ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, ఫ్యాన్స్, ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలిపాడు. ఫ్యామిలీ మద్దతు, త్యాగాలు లేకుండా ఈ ప్రయాణం సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నాడు. 2010లో బెంగళూరులో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేసిన పుజారా.. ఆదే ఆసీస్‌‌‌‌పై ఓవల్‌‌‌‌ వేదికగా 2023లో చివరి టెస్టు ఆడాడు. తన కెరీర్‌‌‌‌‌‌‌‌లో  ఐదు వన్డేలు మాత్రమే ఆడిన అతను మొత్తంగా 51 రన్స్ మాత్రమే చేశాడు. పుజారా ఆట బాగా స్లోగా ఉందని రెండేండ్ల కిందట అతనిపై వేటు వేశారు. అయినా తనకు ఎలాంటి విచారం లేదని, ఇంతకాలం ఇండియాకు ఆడటం తన అదృష్టమని పుజారా చెప్పాడు.  

పుజారా మూడో స్థానంలో నువ్వు క్రీజులోకి రావడం జట్టుకు ఎప్పుడూ భరోసా ఇచ్చేది. నీలో శాంతం, ధైర్యం, టెస్ట్ క్రికెట్ పట్ల అపారమైన ప్రేమ కనిపించేవి. ఒత్తిడిలోనూ నీ టెక్నిక్,  కూల్‌‌‌‌ నెస్ జట్టుకు అండగా నిలిచాయి. ముఖ్యంగా 2018లో ఆస్ట్రేలియాపై మన విజయం నీ అసాధారణమైన పోరాటం లేకుంటే సాధ్యమయ్యేది కాదు.

సచిన్

తుఫాను రేగినప్పుడు అతను అండగా నిలబడ్డాడు. ఆశలు సన్నగిల్లినప్పుడు తను పోరాడాడు. పుజ్జీ (పుజారా)కి అభినందనలు

హెడ్ కోచ్ గౌతమ్‌‌‌‌ గంభీర్

పుజారా కెరీర్ పట్టుదల, నిస్వార్థానికి ఒక గొప్ప ఉదాహరణ.  తన టెస్ట్ క్రికెట్ స్ఫూర్తికి ప్రతీక. అతని అంకితభావం అసాధారణం. ఈ ఆటకు, దేశానికి పుజారా చేసిన సేవలకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.

బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా