
రాంచీ: చత్తీస్‌గఢ్‌కు చెందిన బీజేపీ నేతను కేటుగాళ్లు బోల్తా కొట్టించారు. స్టేట్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లో ఉన్నత పదవి ఇప్పిస్తామని చెప్పి రూ.41.3 లక్షల మేర మోసం చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొండగావ్ జిల్లా బీజేపీ యూనిట్ కోర్ గ్రూప్‌లో సంతోశ్ కటారియా సభ్యుడిగా ఉన్నారు. గతంలో మధ్యప్రదేశ్ లోని ఉత్తర బస్తర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు.
రాయ్‌పూర్‌కు చెందిన రాజీవ్ సోనీ.. కాజల్ జోషిని సంతోష్ కటారియాకు పరిచయం చేశారు. గతేడాది ఆగస్టు 12న కాజల్ జోషి ఆయనను మొబైల్ ఫోన్లో సంప్రదించింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్లో ఆఫీస్ బేరర్‌గా పనిచేశానని.. కేంద్రమంత్రులు, చత్తీస్ గఢ్ మంత్రులతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె నమ్మించింది. రూ. 3 కోట్లు ఇస్తే ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పింది.
అంత ఇచ్చుకోలేనని చెప్పి కటారియా ఆమెకు రెండు విడతల్లో రూ.41.3 లక్షలు బదిలీ చేశాడు. అయినప్పటికీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చైర్మన్ నియామకాల్లో తనకు పదవి రాకపోవడంతో సంతోష్ కటారియా కేశ్కల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.