
- ప్రభుత్వ వెబ్సైట్లలో లీడర్ల ఫొటోలు ఉండొద్దు
- 50వేల కంటే ఎక్కువ క్యాష్ తరలిస్తే ఆధారాలు చూపాలి
- రాష్ట్రంలో కోడ్ అమలులోకి వచ్చింది : సీఈవో వికాస్‌రాజ్
- ఫిర్యాదుల కోసం 1950కు ఫోన్ చేయాలని సూచన
- ఓటు హక్కు నమోదు కోసం ఈ నెల 31 వరకు గడువు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. ఆన్ గోయింగ్ స్కీమ్స్ విషయంలో గతంలో ఎలాంటి నిబంధనలు వర్తించాయో ఇప్పుడు కూడా అవే వర్తి స్తాయని తెలిపారు. ఏవైనా కంప్లయింట్స్ ఉంటే ఈసీ ఆదేశాలకు తగ్గట్టుగా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. నిబంధనల ప్రకారం.. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్తే ఆధారాలు చూపాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో రాజకీయ నాయకుల ఫొటోలు తొలగించాలన్నారు. ప్రభుత్వ, పబ్లిక్ ప్లేసుల్లో సర్కార్‌కు సంబంధించిన పథకాల హోర్డింగ్‌లు, బ్యానర్లు, ఫొటోలు తొలగించాలని తేల్చిచెప్పారు.
ఫిర్యాదుల కోసం 1950కు కాల్ చేయాలని, ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. సోమవారం ఆయన బీఆర్కే భవన్లో మీడియాతో మాట్లాడారు. మంత్రులు వారి కాన్వాయ్ వాహనాలను పార్టీ కార్యక్రమాల కు వాడుకోరాదని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే చాన్స్ ఉందని తెలిపారు. రాష్ట్రంలోని బార్డర్స్‌లో దాదాపు 148 చెక్ పోస్టులు పెట్టినట్లు చెప్పారు. పోలీసులు, అధికారుల తనిఖీల్లో సరైన పత్రాలు చూపించకుంటే.. వాటిని సీజ్ చేస్తారని తెలిపారు.
కేవలం నగదు మాత్రమే కాకుండా బంగారం, ఇతర ఆభరణాలు భారీస్థాయిలో తీసుకెళ్లాలంటే తగిన ఆధారాలు, సర్టిఫికెట్లు చూపాల్సిందేనని స్పష్టం చేశారు. అత్యవసర వైద్యం, స్కూల్, కాలేజీ ఫీజులు, వ్యాపారం, శుభకార్యాలు, ఇతర అవసరాలకు అధిక మొత్తంగా నగదు తీసుకెళ్తున్న వారు పత్రాలు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.
క్రిమినల్ కేసులు తెలపకపోతే నామినేషన్ తిరస్కరణ
పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్‌ను కచ్చితంగా నింపాలని వికాస్‌రాజ్ అన్నారు. క్రిమినల్ కేసులు ఉంటే అందులో తప్పనిసరిగా పేర్కొనాలని చెప్పారు. టీవీతో పాటు పేపర్లలోనూ ఆ కేసుల వివరాలు ప్రకటించాలని, లేదంటే నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు.
ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగించుకోవచ్చని చెప్పారు. ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ బ్యాలెట్ పత్రాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నగదు లావాదేవీలు, లిక్కర్ సేల్స్‌పై పర్యవేక్షణ ఉందని.. ఎప్పటికప్పుడు స్టాక్, సేల్స్ లెక్కల వివరాలు, తనిఖీలు ఉంటాయని తెలిపారు.
మరిన్ని నిబంధనలు
- హాస్పిటల్స్‌లో చెల్లింపుల కోసం ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్తే.. పేషెంట్ రిపోర్టులు, హాస్పిటల్ రశీదులు, ఇతర డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలి. ఏవైనా అవసరాల కోసం బ్యాంకు నుంచి నగదు డ్రా చేస్తే.. ఖాతా పుస్తకం లేదా ఏటీఎం చీటీ వంటివి తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలి.
- వస్తువులు, ధాన్యం విక్రయం డబ్బు అయితే వాటికి సంబంధించిన బిల్లు చూపించాలి. ఎక్కువ మొత్తంలో నగదు లభ్యమైతే ఐటీ, జీఎస్టీ అధికారులు కూడా రంగంలోకి దిగుతారు. కచ్చితమైన ఆధారాలు చూపిస్తేనే తిరిగి ఇస్తారు.
- భూమి అమ్మిన సొమ్ము అయితే వాటి దస్తావేజులు చూపాలి. వ్యాపారం, ఇతర సేవల కోసం డబ్బు వాడితే తనిఖీల టైంలో లావాదేవీల వివరాలను ఆధారాలతో అధికారులకు చూపించాలి.