ఆఫీసర్లు అలర్ట్గా ఉండాలి .. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగితే చర్యలు

ఆఫీసర్లు అలర్ట్గా ఉండాలి .. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగితే చర్యలు
  • సమస్యలు పరిష్కరించాలి.. అభివృద్ధి పనులు స్పీడప్​ చేయాలి 
  • దిశ కమిటీ మీటింగ్​లో ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి 
  • పలు సమస్యలపై చర్చించిన అధికారులు, ప్రజాప్రతినిధులు 
  • పంచాయతీరాజ్​ఇంజినీరింగ్ ఆఫీసర్ల పనితీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రతీ పనిలో ఆఫీసర్లు అలర్ట్​గా ఉండాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు.  ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని పంచాయతీ సెక్రటరీలను హెచ్చరించారు. శనివారం కొత్తగూడెంలోని కలెక్టరేట్​లో ఎంపీ అధ్యక్షతన దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్​ అధికారులు కేర్​ ఫుల్​గా పనిచేయాలన్నారు.

 కొంతమంది సెక్రటరీలు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను  వేధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, ఒకవేళ అదే నిజమైతే పోలీస్​లకు కంప్లైంట్ ఇస్తామని  హెచ్చరించారు.  ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను స్పీడప్​చేయాలని సూచించారు. కాగా, సమస్యలు చాలా ఉన్నాయని, సమయం లేకపోవడంతో పూర్తి స్థాయిలో చర్చించలేకపోతున్నామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే  మరోసారి అక్టోబర్​లో దిశ కమిటీ మీటింగ్​ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 

ఆఫీసర్లపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం..

అభివృద్ధి పనుల విషయంలో పంచాయతీ రాజ్​ ఇంజినీరింగ్​అధికారులు పూర్తి వివరాలతో మీటింగ్​కు రాకుండా పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు కారణాలతో పనులు రద్దు అయిన విషయాన్ని కూడా ప్రజాప్రతినిధుల దృష్టికి తేవడం లేదన్నారు. పనులు ఆగినప్పుడు తమ దృష్టికి తేవడం లేదని, తర్వాత తాము అడిగినప్పుడు నిధులు వెనక్కి వెళ్లాయని చెప్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పలు పనులకు సంబంధించిన టెండర్లను వెంటనే పూర్తి చేసి వర్క్స్​ త్వరగా చేపట్టేలా ప్లాన్​ చేయాలన్నారు.

 పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్​ లిస్ట్​లో పెట్టాలని సూచించారు. రైల్వే అధికారుల తీరుపై కూడా ప్రజాప్రతినిధులు ఫైర్​ అయ్యారు. కొవిడ్​ టైంలో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నేషనల్​ హైవే అధికారుల పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వానాకాలం సీజన్​లో పీహెచ్​సీలలో వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గుండాలలో డయాలసిస్​ సెంటర్​ ఏర్పాటు చేయాలన్నారు.  

పలు సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యేలు.. 

గ్రామాల్లో ఒక్కో డీలర్​ వద్ద రెండు, మూడు రేషన్​ షాపులున్నాయని ఎమ్మెల్యేలు కలెక్టర్​ దృష్టికి తీసుకువచ్చారు. కొత్తగా రేషన్​ షాపులు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాలన్నారు.  గత దిశ కమిటీ మీటింగ్​లో ప్రధానంగా ఆరు అంశాలను ఆఫీసర్ల దృష్టికి తీసుకువచ్చానని, అందులో హాస్పిటల్​లో పోస్టుమార్టం గది నిర్మాణం ఒక్కటే పూర్తయిందని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. పలు పనుల్లో కొనసాగుతున్న జాప్యంపై  ఆఫీసర్లు తనతో చర్చించలేదన్నారు. 

జిల్లాలో 2జీ సిగ్నల్స్​సరిగా లేక టెలికం శాఖపై కంప్లైంట్స్​వస్తున్నాయని తెలిపారు. అంగన్​వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ల పోస్టులను భర్తీ చేసేలా ఆఫీసర్లు చర్యలు చేపట్టాలన్నారు. అద్దె భవనాల్లో ఉన్న వాటి స్థానంలో పర్మినెంట్​ బిల్డింగ్​లు నిర్మించేలా ప్లాన్​చేయాలన్నారు.  కొందరు ఆఫీసర్ల తీరుతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆధార్​ కార్డు నంబర్లు తప్పుగా నమోదు చేయడం మూలంగా పలువురు లబ్ధిదారులు చేపట్టిన పనులకు బిల్లు రాక అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి ఇసుక ఇబ్బందులు లేకుండా కలెక్టర్​ చర్యలు చేపట్టాలని కోరారు.  

వృద్ధుల వేలిముద్రలు పడకపోవడంతో రేషన్​ అందక ఇబ్బందులు పడుతున్న విషయాన్న ఎమ్మెల్యేలు కలెక్టర్​ దృష్టికి తేగా, దీనికి ఆయన స్పందిస్తూ రేషన్​ షాపుల్లో హెల్ప్​ లైన్​ నెంబర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సివిల్​ సప్లై డిప్యూటీ తహసీల్దార్ల ఫోన్​ నెంబర్లను ప్రతి రేషన్​ వద్ద నోటీస్​ బోర్డులో పెట్టాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్​ కార్డులు ఇవ్వాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. కాగా, అశ్వారావుపేట మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు రూ. 15కోట్లతో ప్రపోజల్స్​ పంపించినట్లు తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్​, రాందాస్​ నాయక్, ఐటీడీఏ ప్రాజెక్ట్​ అధికారి రాహూల్, అడిషనల్​ కలెక్టర్​ వేణుగోపాల్​తో పాటు దిశ కమిటీ సభ్యులు, జిల్లా ఆఫీసర్లు పాల్గొన్నారు. 

స్పోర్ట్స్​ పరికరాల పంపిణీ.. 

రూ. 50లక్షలతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్​ పరికరాలను కోచ్​లు, క్రీడాకారులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్​తో కలిసి ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అందజేశారు. ఈ ప్రోగ్రాంలో జిల్లా క్రీడలు, యువజన శాఖాధికారి పరంధామరెడ్డి పాల్గొన్నారు.