జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి సత్యేంద్ర జైన్

 జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి సత్యేంద్ర జైన్

ఆరోపణలు నిజమైతే చర్యలు తీసుకునేవాడిని : కేజ్రీవాల్

ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ విషయంలో ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ మంత్రిపై అక్రమంగా కేసు మోపారని, రాజకీయ కారణాలతో ఆయనపై కేసు పెట్టారని అన్నారు. తమ పార్టీ, ప్రభుత్వాలు (ఢిల్లీ, పంజాబ్) నిజాయితీకి కట్టుబడి ఉన్నాయని, అవినీతిని సహంచమన్నారు. ఈ కేసులో మంత్రి సత్యేంద్ర జైన్ పై వచ్చిన ఆరోపణల్లో ఒక్క శాతమైన నిజమున్నట్లు తేలినా తానే స్వయంగా ఆయనపై చర్యలు తీసుకునేవాడినని చెప్పారు. ఢిల్లీలో రోడ్డు అభివృద్ధి పనుల తనిఖీ సందర్భంగా కేజ్రీవాల్ ఈ కామెంట్స్ చేశారు.   

మరోవైపు మంత్రి  సత్యేంద్ర జైన్ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో జైన్‌ను ఢిల్లీ కోర్టు జూన్ 9వ తేదీ వరకు ఈడీ కస్టడీకి పంపింది. 

అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవల పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను సీఎం భగవంత్ మాన్ తన మంత్రివర్గం నుంచి తొలగించిన విషయాన్ని సీఎం కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను దాచిపెట్టే అవకాశం ఉన్నా... ఆప్ ప్రభుత్వం చొరవ తీసుకుని, మంత్రిని అరెస్ట్ చేసిందన్నారు. అయిదేళ్ల క్రితం కూడా ఢిల్లీలో ఒక మంత్రిని తొలగించి, సీబీఐకి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము దర్యాప్తు సంస్థల కోసం వేచి చూడమని, తామే స్వయంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సత్యేందర్ జైన్ కేసును తాను స్వయంగా అధ్యయనం చేసినట్లు సీఎం కేజ్రీవాల్ చెప్పారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, జైన్ సత్యమార్గంలో నడుస్తున్నారని, ఆయన తప్పనిసరిగా నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పారు. 

మనీలాండరింగ్ కేసులో మంత్రి సత్యేంద్ర జైన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  సోమవారం (మే 20వ తేదీన) సాయంత్రం అరెస్ట్ చేసింది. కోల్ కతాకు చెందిన ఓ కంపెనీకి సత్యేంద్ర జైన్ అక్రమంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ కేసులో సత్యేంద్ర జైన్, ఆయన బంధువులకు సంబంధాలున్నాయని భావిస్తున్న కంపెనీలకు చెందిన రూ. 4.81కోట్ల విలువైన స్థిరాస్తులను ఈడీ గత ఏప్రిల్ లోనే జప్తు చేసింది. సత్యేంద్రజైన్ పై 2017లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. త్వరలో తమ మంత్రి జైన్ ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని, జనవరిలోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రవాల్ చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

సీఎం కేసీఆర్ ప్రజాసమస్యలను గాలికొదిలేశారు

దేశ ప్రధానిని కాదు.. 130 కోట్ల ప్రజలకు సేవకుడిని