నిర్మల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

నిర్మల్‌ కలెక్టరేట్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

నిర్మల్‌ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం (జూన్ 4న) ప్రారంభించారు. మొదట కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ సీటులో వరుణ్‌ రెడ్డిని కూర్చండబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 

అంతకు ముందు కలెక్టరేట్‌ వద్ద పోలీస్‌ సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ శాంతికుమారి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్‌, జీవన్‌రెడ్డి, రేఖా నాయక్‌, నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొన్నారు.

నిర్మల్‌ రూరల్‌ మండలంలోని ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో ప్రభుత్వం కలెక్టరేట్‌ను నిర్మించింది. 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన రెండు అంతస్తులు ఉండేలా కలెక్టరేట్‌ను నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో కలెక్టర్‌, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు ఉంటాయి. రెండు వెయిటింగ్‌ హాల్స్‌, రెండు వీడియో కాన్ఫరెన్స్‌ హాల్స్‌, అధికారుల సహాయకులకు రెండు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. 

దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించేలా సువిశాల కాన్ఫరెన్స్‌ హాల్‌ను గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిర్మించారు. కలెక్టరేట్ మొదటి అంతస్తులో వివిధ శాఖల కార్యాలయాలు ఉంటాయి. కలెక్టరేట్‌ను పూర్తి ఆక్సిజన్‌ జోన్‌గా రూపొందించారు. అండర్‌ గ్రౌండ్‌లో 80వేల లీటర్ల నీటి సామర్థ్యంతో సంప్‌, 20 వేల లీటర్ల సామర్థ్యంతో రెండు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మించారు. కలెక్టరేట్‌ ముందు ఆవరణలో హెలిప్యాడ్‌ను సైతం ఏర్పాటు చేశారు.