
తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకు మీరే కారణమని(ప్రభుత్వ ఉద్యోగులు) కేసీఆర్ స్పష్టం చేశారు. నిర్మల్ కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ‘‘ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజింపబడి పరిపాలన ప్రజలకు దగ్గరైంది. నాలుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఆసిఫాబాద్ లాంటి అటవీ ప్రాంతంలోనూ మెడికల్ కాలేజీ వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే 50 ఏళ్లకు కూడా మెడికల్ కాలేజీ వచ్చేది కాదు. పవర్ పర్ క్యాపిటలో నంబర్ వన్ లో ఉన్నాం. ముఖ్రా కే గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకుని.. రాష్ట్రానికి గౌరవం తెచ్చిపెట్టింది’’ అని వ్యాఖ్యానించారు.
‘‘దళిత జాతి, గిరిజన జాతి, వెనుకబడి తరగతుల్లో నిరుపేదలు ఉన్నారు. జరగాల్సింది చాలా ఉంది. ఇదే పట్టుదల.. కృషితో ముందుకు పోయి మన సోదరులుగా ఉన్న దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, అగ్ర వర్ణాల్లో ఉన్న నిరుపేదలను సమాన స్థాయికి తీసుకుపోవాలి. ఎన్నికల తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. గతంలో తాగు, కరెంట్, సాగునీటి సమస్యలు ఉండేవి. వీటన్నింటిని 9 ఏళ్లల్లో అధిగమించాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి.. భవిష్యత్ కోసం పురోగమించాలి. కష్టపడి పేదరికాన్ని తరిమేయాలి. దేశానికే తలమానికంగా ఉండాలి. పోడు భూముల పంపిణీని నిర్వహించాలి. ఈ సీజన్ నుంచే రైతుబంధు అందించే పనిలో ప్రభుత్వం ఉంది. మహారాష్ట్ర ప్రజలు మన పథకాలను చూసి తెలంగాణ మోడల్ కావాలని కోరుతున్నారు. తెలంగాణ మోడల్ భారతదేశమంతా మార్మోగుతుంది. అందుకు మీరే కారణం’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు.. నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం (జూన్ 4న) ప్రారంభించారు. మొదట కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్ సీటులో వరుణ్ రెడ్డిని కూర్చండబెట్టి.. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది ముఖ్యమంత్రికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, రేఖా నాయక్, నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొన్నారు.