ఎంటర్టైన్ మెంట్ రంగంలో పిల్లలకు కొత్త మార్గదర్శకాలు

ఎంటర్టైన్ మెంట్ రంగంలో పిల్లలకు  కొత్త మార్గదర్శకాలు

ఎంటర్టైన్ మెంట్ రంగంలో ఉండే పిల్లలకు ప్రత్యేకించి నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్  (NCPCR), బాలల హక్కుల కోసం అపెక్స్ బాడీ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. వినోద పరిశ్రమలో భాగమైన చలనచిత్రాలు, టీవీ, రియాలిటీ షోలు, OTT ప్లాట్‌ఫారమ్‌లు, సోషల్ మీడియా వెబ్‌సైట్‌లలో పిల్లల పట్ల కొన్ని జాగ్రత్తలు పాటించాలనే ఆదేశాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి -టాప్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా వర్తిస్తాయి. ఇవే కాదు ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల విషయంలోనూ ఈ గైడ్ లైన్స్ వర్తిస్తాయి.

  • మూడు నెలల కంటే తక్కువ వయసున్న పసికందులను తెరపై చూపించకూడదు. అయితే.. తల్లిపాలు, ఇమ్యునైజేషన్‌ ప్రచారాలకు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం మినహాయింపు ఉంటుంది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్షతో సహా శిక్షాపరమైన నిబంధనలు ఉంటాయి.
  • ఇక ప్రొడక్షన్ కు సంబంధించిన వాతావరణం అంతా కూడా పిల్లలకు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.  ఈ విషయంలో ఆ ప్రోగ్రామ్ కు సంబంధించిన నిర్మాతలు, మిగతా వారందరూ ప్రొటోకాల్ పాటిస్తూ... పిల్లల మట్ల మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. అంతే కాకుండా పిల్లలపై అసభ్య ఘటనలను గురించి చూపించేటపుడు, చెప్పేటపుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దాని వల్ల వారు ఎలాంటి ఇబ్బందుల్లోనూ, రిస్కుల్లోనూ పడకుండా చూసుకోవాలి.
  • ఏ పిల్లవాడినీ ఆరు గంటలకు మించి పని చేయించకూడదు. ఈ సమయంలో వారికి ప్రతి మూడు గంటలకొకసారికి విరామమివ్వాలి. రాత్రి 7 నుంచి 8 గంటలలోపే వారి పనివేళలు ముగించాలి.
  • నిర్మాతలు కూడా పిల్లలు చదువుకోవడానికి తగిన సౌలభ్యాలను కల్పించాలి. వారికి సంబంధించిన షూటింగ్ ను 27 రోజులకు మించి పొడిగించకూడదు. అది ఆ పిల్లల చదువులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని NCPCR తెలిపింది. లేదంటే వారికి ప్రైవేట్ ట్యూటర్లను అందుబాటులో ఉంచాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
  • బాండెడ్ లేబర్ సిస్టమ్ (అబాలిషన్) యాక్ట్, 1976 ప్రకారం కొన్ని పరిస్థితుల్లో పిల్లలతో నటింపజేయాల్సి వస్తే.. వారితో ఒప్పందం చేసుకోకూడదని ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 
  • మైనర్లు... ముఖ్యంగా ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి హానికరమైన లైటింగ్, చికాకు కలిగించే లేదా కలుషితమైన సౌందర్య  సాధనాలు వాడే విషయంలో వారికి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. పిల్లలకు సంబంధించిన షూటింగ్స్, కార్యక్రమాలను షూట్ చేసేటపుడు అందులో పాల్గొనే వ్యక్తులు ముందుగానే తమ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను అందించాలి. వారికి ఏదైనా వ్యాధి లేదా ఇతర వ్యాధులు లేవనే ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. దానిపై పోలీసులు వెరిఫికేషన్ కూడా ఉండాలి.
  • ప్రోగ్రామ్- నిర్మాత పిల్లలకు తగిన ఆహారం, నీరు లాంటి సౌకర్యాలను అందుబాటులో ఉండేలా చూడాలి. వీటికి తోడు లింగ బేధాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి విశ్రాంతి గదిని కేటాయించాలి. పెద్దలు,  ప్రత్యేకించి అపోజిట్ జెండర్ కలిగిన వ్యక్తులతో పిల్లలు రూంను షేర్ చేసుకోకుండా... వారికి వేరుగా మరొక గదిని అలాట్ చేయాలి. ఇక డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం ప్రోగ్రాం కోసం పిల్లలను ఎంగేజ్ చేయడానికి నిర్మాతలు జిల్లా మేజిస్ట్రేట్ నుండి అనుమతి పొందవలసి ఉంటుంది.
  • జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2015లోని సెక్షన్ 77 ప్రకారం  పిల్లలతో మద్యం సేవించడం, ధూమపానం చేయడం లాంటివి చేయించకూడదు. వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావితం చేసేలా అవహేళనలు, అవమానాలు, కఠినమైన వ్యాఖ్యలు, అసభ్య ప్రదర్శన లాంటివి పిల్లలతో చేయించకూడదనే విషయాన్ని నిర్మాతలు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలి. దీని కంటే ముందు పిల్లలు తమ పేర్లను జిల్లా మెజిస్ట్రేట్ లో నమోదు చేయించుకోవాలి.
  • పిల్లలు ఏదైనా ప్రకటనల్లో నటించాల్సి వస్తే.. దానికి సంబందించిన (ఐటమ్స్) వస్తువులు కొనమని ఆ పిల్లలను, తల్లిదండ్రులను ఎలాంటి బలవంతం చేయకూడదు.