చిన్న చిన్న కళ్లు పెద్దవి చేసి చిట్టి చిట్టి చేతులతో ప్రకృతిలోని ప్రతిదాన్ని పట్టుకోవాలని, ముట్టుకోవాలని ఉవ్విళ్లూరే బాల్యం నిజంగా నేడు అవస్థల్లో ఉంది. యాంత్రిక యుగంలో ఏదో తాంత్రిక శక్తి ఆవహించినట్లు బాల్యం కుప్పకూలిపోతోంది అనేది ముమ్మాటికీ నిజం. చిరునవ్వుల కేరింతలు, దాగుడుమూతల పలకరింపులు మాయ మయ్యాయి. పసిచూపులు పాశవికంగా మారిపోయాయి. పగలూ, ప్రతీకారాలు వెళ్లగక్కుతున్నాయి. ఒకరకంగా బాలలు బందీలయ్యారు. బాల్యం బందిఖానాలో ఉంది. ఎంతసేపూ సెల్ఫోన్ చేతిలో పట్టుకుని ఉండడమే కనిపిస్తోంది. ఇటు విద్యా విజ్ఞానం, అటు ఆటాపాట అన్నింటికీ చరవాణి పట్టుకోవడమే పనిగా మారింది. కదిలే కాళ్లు, మెదడును కదిలించే ఆలోచనలు, గమ్మత్తయిన ఆటలు, ఆటల్లో అలసిన శరీరాలు ఏవి...? ఎటుచూసినా కానరావడం లేదు. సీతాకోకచిలుకల రెక్కలు విరిచినది ఎవరు అని ఆలోచిస్తే ముమ్మాటికీ ఆ పాపం తల్లిదండ్రులదే.
తల్లిదండ్రులూ ఇకనైనా మారండి
ఆకాశానికి నిచ్చెన వేస్తూ, అందని పళ్లకు అర్రులు చాస్తూ, మార్కుల వేటలో పిల్లల్ని బందీ చేస్తున్నది, ప్రకృతికి, బాహ్య ప్రపంచానికి దూరం చేస్తున్న అమానుషులు కచ్చితంగా అమ్మానాన్నలే. తల్లిదండ్రులు తాము అనుభవించిన స్వేచ్చా స్వాతంత్ర్యాలు తమ పిల్లలకు దూరం చేస్తున్నారు. వాళ్ల బతుకుల్ని భారం చేస్తున్నారు. తాత అమ్మమ్మల స్థానం ఇన్స్టాగ్రాం, వాట్సాప్, వీడియో గేమ్స్ ఆక్రమిస్తుంటే... విలువలు చెప్పని వింత వస్తువుల గారడీలో పిల్లలు, సంపాదన వేటలో తల్లిదండ్రులు తరలిపోతుంటే ఒంటరైన బాల్యం శాపగ్రస్త దశను అనుభవిస్తోంది. తల్లిదండ్రులూ ఇకనైనా మారండి. స్తబ్ధంగా ఉన్న పసితనాన్ని ప్రేమానురాగాలతో తడమండి, అనుబంధ గంధాలతో తడపండి.. నీతి కథలు, పద్యాలు వినిపించండి. వాళ్లకోసం సమయాన్ని కేటాయించండి. మీకన్నా మాకు ఏదీ ఎక్కువ కాదు అనే భరోసా కలిగించండి. పౌరాణిక కథలు తెలియజేయండి. సాటి మనిషిని మనిషిగా చూసే దృక్పథం కల్పించండి. కష్టం విలువ తెలియనివ్వండి. మనుషుల అవసరాన్ని అర్థించనివ్వండి. అరక్షణాల్లో అరచేతుల్లో అన్నీ సమాకూర్చి విలువైన జీవితాన్ని చేజారనివ్వకండి. కన్నపిల్లల రాతలు కన్నీళ్లపాలు చేయకండి. సెల్ ఫోన్లో ఏమి చూస్తున్నారు, ఎవరితో చాటింగ్ చేస్తున్నారనేది చూసి అవసరమైతే తప్పని చెప్పండి. తల్లిదండ్రులుగా ఆ విషయాలు మాట్లాడే హక్కు మీకుంది. తప్పుని తప్పని చెప్పే నైతిక బాధ్యత మీదే. తప్పుని తప్పుగా చెప్పకపోతే ఆ తప్పిదమూ మీదే.
- సూర్యదీప్తి, వేములవాడ
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
