అంగన్ వాడీల్లో చిన్నారులు, గర్భిణులు విలవిల

అంగన్ వాడీల్లో చిన్నారులు, గర్భిణులు విలవిల

బాబోయ్ .. భరిం చలేని ఎండలు.. బయటికి వెళ్లాలంటేనే భయం.. పెద్దోళ్లు కూడా ఇంటి నుంచి బయట కాలుపెట్టలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో చిన్నారులు.. గర్భి ణులు అంగన్‌‌వాడీ సెంటర్లకు వచ్చి పౌష్టికాహారం తీసుకోవాలంటే హడలిపోతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆహారం తీసుకోవాలంటే తప్పనిసరిగా సెంటర్లకు రావాల్సిం దేనన్న నిబంధన పెట్టింది. మధ్యాహ్నం 12గంటలు దాటిన తర్వాతే చిన్నారులకు కేంద్రాల్లో పౌష్టికాహారం అందజేస్తుంటారు. ప్రస్తుతానికి మండుతున్న ఎండలతో ఇంట్లోనుంచి బయటకు రావడమే కష్టంగా ఉంటే.. మిట్టమధ్యాహ్నం సెంటర్లకు రావడం చిన్నారులు, గర్భి ణులకు కష్టంగా ఉంది. ఈక్రమంలో ఇంటికే పౌష్టికాహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వేడితో ఉక్కిరిబిక్కిరి…

జిల్లావ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో 914 అంగన్ వాడీ సెంటర్లు ఉన్నాయి. ఇందులో సొంత భవనాలు 14 , ప్రభుత్వ సూళ్లల్లో 29, కమ్యూనిటీ హళ్లల్లో 139 , కిరాయి గదులలో 732సెం టర్లు కొనసాగుతున్నాయి. వీటిల్లో ఎక్కువగా రేకులతో ఉన్న గదులలోనే ఉన్నాయి. వాటిల్లో సరైన వసతులు లేకపోవడం ఒకటైతే.. కరెం టు, ఫ్యాన్లు లేకపోవడం వల్ల సెంటర్లకు వస్తున్న పిల్లలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కి అవుతున్నారు. చార్మినార్‌‌, గోల్కొండ, ఖైరతాబాద్‌‌, నాంపల్లి , సికిం ద్రాబాద్‌‌ ప్రాజెక్టుల పరిధిలో ని732 అంగన్‌‌వాడీ సెంటర్లు సగం వరకు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఉదయం 9:30గంటలకు సెంటర్లకు చేరుకుంటున్న చిన్నారులు మధ్యాహ్నం ఆ గదులలో ఉంటున్న వేడితో తట్టుకోలేక పోతున్నారు.

చల్లటి నీళ్లు, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు కరువు….

జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్ వాడీ సెంటర్లలో చిన్నారుల కోసం చల్లటి నీళ్లు, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ అవి చూద్దామన్నా కనిపించడం లేదు. ఈ ఎండాకాలం పూర్తి అయ్యేవరకు సెంటర్లలో నీళ్లకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అధికారులు అంటున్నారు. కానీ పాతబస్తీలోని చాలా సెం టర్లలో నీటి కొరత తీవ్రంగా ఉందని లబ్ధిదారులు చెబుతున్నారు. కిరాయి గదులలో కొనసాగతున్న సెంటర్లలో ఫ్యాన్లు కూడా లేవని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంగన్ వాడీలంటే చిన్నచూపు…

ఎండాలకాలం పెద్ద పాఠశాలలకు సెలవులు ఇస్తున్న ప్రభుత్వం అంగన్‌‌వాడీ కేంద్రాలను చిన్న చూపు చూస్తోందని అంగన్‌‌వాడీ టీచర్స్​, వర్కర్స్​ యూనియన్‌‌ ఆరోపిస్తోంది. ఎండాకాలం కారణంగా లబ్ధిదారులను అతికష్టంగా సెంటర్లకు తీసుకురావాల్సి వస్తోందని అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్లు, ఆయాలకు పదిహేను రోజులు సెలవులు ఇస్తున్నప్పటికీ ఎవరైనా ఒకరు తప్పనిసరిగా సెంటర్ లో ఉండాల్సిందేనని, దీనివల్ల పనిభారం పడుతోం దనివారు పేర్కొంటున్నారు.