
మధుర హైవే సమీపంలో ఓ మహిళ మృతదేహం ఉందన్న సమాచారంతో మధుర పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. మృతదేహం అర్ధనగ్నంగా ఉండటం, శరీరం మీద కొన్ని చోట్ల గాయలుండటం, సమీపంలోనే ఖాళీ మద్యం సీసాలు ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి చంపేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఆదివారం ఉదయం మధుర హైవే సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుతున్న పిల్లలకి… అక్కడి రైల్వే ట్రాక్ వద్ద ఓ మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే వారు ఉదయం 10.45 గంటల సమయంలో పీఎస్ కి కాల్ చేసి విషయం చెప్పారు. వారి సమాచారం మేరకు తమ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు మధుర సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ షలాబ్ మాథుర్.
డెడ్ బాడీ పై చీర కప్పబడి, గాజులు విరిగిపోయి ఉన్నాయని.. గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, చంపి ఉండొచ్చని ఎస్పీ మీడియాతో అన్నారు. సంఘటన జరిగి ఒకరోజు అయి ఉండవచ్చని, మృతదేహం ముఖం పై ఏదో జంతువు గీరినట్లుగా గాట్లు ఉన్నాయన్నారు. శవపరీక్ష కోసం ఆసుపత్రికి పంపామని, పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.
మహిళ కు సంబంధించి గుర్తింపు సమాచారాన్ని సేకరిస్తున్నామని , ఈ కేసుపై దర్యాప్తు చేయడానికి నాలుగు పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.