సేంద్రియ సాగు నేర్పిస్తారీపిల్లలు

సేంద్రియ సాగు నేర్పిస్తారీపిల్లలు

స్కూల్​ అయిపోగానే పిల్లలేం చేస్తారు. ఆనందంగా ఇంటికెళ్తారు. లేదా స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఏ గ్రౌండుకో పరిగెత్తుతారు. కానీ, ఆ చిన్నారులు మాత్రం బడి అయిపోయిన వెంటనే పక్కనే ఉన్న పొలానికి పరుగులు పెడతారు. వెంటనే సాగులో నిమగ్నమవుతారు. ఎందుకంటే ఆ స్కూలు పిల్లలు వ్యవసాయం చేస్తున్నారు. అది కూడా సేంద్రియ వ్యవసాయం. మహారాష్ట్రలోని రెండు ఊళ్లకు చెందిన విద్యార్థులు ఇలా సాగు చేస్తూ తల్లిదండ్రులకే స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

మహారాష్ట్రలోని కొల్హాపూర్​ అనే చిన్న పట్టణానికి సమీపంలో ఉంటాయి దఖల్, గొలివాన్​ అనే ఊళ్లు. ఒకప్పుడు వ్యవసాయంపై ఆధారపడ్డ ఊళ్లివి. కానీ, ఇప్పుడు రకరకాల కారణాల వల్ల ప్రజలు చాలా వరకు వ్యవసాయానికి దూరంగా ఉంటున్నారు. దీంతో కొల్హాపూర్​ ప్రాంతంలో వ్యవసాయం తగ్గుతూ వచ్చింది. చాలా మంది వ్యవసాయం మానేసి కూలీలుగా మారుతున్నారు. దీనివల్ల అక్కడి ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో క్యాన్సర్​ పేషెంట్ల సంఖ్య ఎక్కువగా పెరుగుతోంది.

రసాయనాల ప్రభావంతోనే

ఈ ప్రాంతంలో సరైన నీటి వసతులు లేకపోవడం వల్ల పంటలు పండించేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. పైగా దిగుబడి పెరిగేందుకు రసాయనాలతో తయారైన ఎరువులు, పురుగుల మందులు విపరీతంగా వాడటం మొదలుపెట్టారు. వీటి ప్రభావం తాత్కాలికమే. ఇదే పద్ధతిలో వ్యవసాయం చేస్తే దిగుబడి కొంతకాలం తర్వాత తగ్గిపోతుంది. ఈ పంటలను ఎక్కువగా తింటే క్యాన్సర్​ వంటి జబ్బులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్లే ఇక్కడి ప్రజల్లో చాలా మంది క్యాన్సర్​ బారినపడ్డారు. వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవడం, ఉపాధి దొరక్కపోవడం, అనారోగ్యం బారిన పడటం మూలంగా చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.

ఎన్జీవో అధ్యయనంతో

‘ఇన్​సైట్​ వాక్’  అనే ఒక స్వచ్ఛంద సంస్థ ఇక్కడి పరిస్థితులపై అధ్యయనం చేసింది. స్థానికులకు ఉపాధి కల్పించి ప్రజల్లో మార్పు తీసుకురావాలని భావించింది. పిల్లలను, మహిళలను భాగస్వాముల్ని చేసి దఖల్, గొలివాన్ ​గ్రామాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ గ్రామాల పరిధిలోని ఒక కమ్యూనిటీ సెంటర్​లో పిల్లలు, స్థానికులతో కొన్ని పరిష్కార మార్గాల గురించి చర్చలు జరిపారు. వాళ్ల ప్రధాన లక్ష్యం తిరిగి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం. దానికి పరిష్కారమే పాత విధానాన్ని అనుసరించడం.

సేంద్రియ సాగు

ఇప్పుడంటే  కృత్రిమ రసాయనాలతో తయారైన ఎరువులు, పురుగుల మందులు వాడి వ్యవసాయం చేస్తున్నారు. కానీ, ఒకప్పుడు ఇవేవీ లేకుండానే పంటలు పండించే వాళ్లు. సేంద్రియ విధానంలోనే వ్యవసాయం చేసేవాళ్లు. అలాగే సాగు చేసి, పంటలు పండించాలని నిర్ణయించిందీ సంస్థ.

కొద్దిపాటి స్థలంలోనే

పెద్దలు ఈ నిర్ణయంపై ఆసక్తి చూపకపోవడంతో పిల్లలతోనే దీన్ని చేసి చూపించాలనుకున్నారు. ఇందుకోసం రెండు ఊళ్లలోని దాదాపు ఎనభై మంది విద్యార్థులతో సేంద్రియ వ్యవసాయం చేయించారు. స్థానిక కమ్యూనిటీ హాల్​ పరిధిలో ఉన్న కొద్దిపాటి స్థలంలోనే పిల్లలకు సేంద్రియ సాగు పాఠాలు నేర్పించారు. ఇంట్లోని వ్యర్థ పదార్థాలతో సహజ ఎరువును తయారు చేయించారు. పిల్లల చేతే విత్తనాలు నాటించి, పంటలు పండించారు.

పంటలు ఎండినా

అయితే మొదట్లో వాతావరణం అనుకూలించకపోవడంతో పంటలన్నీ ఎండిపోయాయి. దీంతో ఈ విధానం పనికిరాదని చాలా మంది వాళ్లను నిరుత్సాహ పరిచారు. కానీ, పిల్లలు మాత్రం నమ్మకాన్ని కోల్పోలేదు. ఈ పద్ధతిలో ఒకప్పుడు వ్యవసాయం చేసిన తాతలు, ఇతర పెద్దల సాయం తీసుకుని మళ్లీ సాగు చేయడం మొదలుపెట్టారు. వాళ్లందరి సహకారంతో కొద్ది రోజుల్లోనే మళ్లీ పంటలు బాగా పండాయి. టొమాటో, వంకాయ వంటి కూరగాయలు, రకరకాల పండ్లు పండించారు. ఈ సేంద్రియ విధానంతో తక్కువ స్థలంలోనే ఎక్కువ దిగుబడి వచ్చింది. రోజూ స్కూల్​ అవ్వగానే విద్యార్థులు… కమ్యూనిటీ సెంటర్​లో నిర్వాహకులు, పెద్దలతో కలిసి పని చేస్తున్నారు.

పిల్లల స్ఫూర్తితో

ఒకప్పుడు రసాయనాలతో వ్యవసాయం చేసిన స్థానికులు.. పిల్లలు సేంద్రియ పద్ధతిలో పంటలు పండించడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. క్రమంగా ఈ విధానం కమ్యూనిటీ సెంటర్​ దాటి పొలాలకు పాకింది. ఇప్పుడు స్థానికులు కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పిల్లలు చేసిన పని వల్ల స్ఫూర్తి పొంది తల్లిదండ్రులు కూడా ఈ విధానంవైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ విషయంలో చైతన్యం తెచ్చేందుకు ‘ఇన్​సైట్​ వాక్’ నిర్వాహకుడు సుబోధ్​ తన బృందంతో చాలా శ్రమించాడు. జానపద కళాకారులతో పాటలు పాడించి, కుడ్య  చిత్రాలు గీయించి స్థానికుల్లో మార్పు తీసుకొచ్చాడు. గతంలో ఊరు విడిచి వెళ్లిన వాళ్లు సైతం ఇప్పుడు తిరిగొచ్చి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఊళ్లో వాళ్ల ఈ మార్పుకు కారణం మాత్రం పిల్లలే. అందరూ ఇదే పద్ధతిలో పంటలు సాగు చేస్తే చుట్టుపక్కల క్యాన్సర్​ శాతం కూడా తగ్గుతుందని ఎన్జీవో భావిస్తోంది.