తైవాన్​ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు

తైవాన్​ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు
  • తైవాన్​ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు
  • యూఎస్ హౌస్ స్పీకర్​తో తైవాన్  ప్రెసిడెంట్ భేటీ తర్వాత డ్రిల్స్
  • 3 రోజుల పాటు నిర్వహిస్తామని పీఎల్ఏ హెచ్చరిక
  • విన్యాసాలను ఖండించిన తైవాన్.. చైనా తీరుపై ఫైర్​


బీజింగ్: చైనా, తైవాన్  మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తైవాన్ చుట్టూ చైనా శనివారం సైనిక విన్యాసాలు ప్రారంభించింది. ఆ దేశ జలాలతో పాటు గగనతలంలోనూ మిలటరీ డ్రిల్స్  నిర్వహించింది. మూడు రోజుల పాటు (సోమవారం వరకు) ఈ డ్రిల్స్  నిర్వహిస్తామని చైనాకు చెందిన ‘పీపుల్స్  లిబరేషన్  ఆర్మీ’(పీఎల్ఏ) ఓ ప్రకటనలో స్పష్టంచేసింది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్  కెవిన్  మెకార్తీతో తైవాన్  ప్రెసిడెంట్ సాయ్  ఇంగ్ వెన్ భేటీ అయిన రెండు రోజులకే చైనా.. తైవాన్  చుట్టూ సైనిక విన్యాసాలు ప్రారంభించడం గమనార్హం. రాబోయే రోజుల్లో తైవాన్  సముద్ర జలాల పరిధితో పాటు ఆ దేశ గగనతలంలోనూ మరిన్ని యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు పంపుతామని పీఏల్ఏ పేర్కొన్నట్లు చైనా మీడియా తెలిపింది. 

‘‘మా దేశానికి చెందిన టాస్క్ ఫోర్స్ తైవాన్ ద్వీపంలోకి ప్రవేశించి విన్యాసాలు నిర్వహిస్తుంది. ఆ దేశాన్ని పూర్తిగా చుట్టుముడతాం. లాంగ్ రేంజ్  రాకెట్  ఆర్టిలరీ, నావల్  డెస్ట్రాయర్లు, మిసైల్  బోట్లు, బాంబర్లు, జామర్లు, ఫైటర్  జెట్లను ఆ దేశం చుట్టూ మోహరిస్తాం. తైవాన్  ఎప్పటికీ మా దేశ భూభాగంలో భాగమే. ఎప్పటికైనా తైవాన్ ను మా దేశంలోకి బలవంతంగానైనా విలీనం చేస్తం. మా దేశ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు సైనిక విన్యాసాలు అత్యవసరం” అని పీఎల్ఏ హెచ్చరించింది. కాగా, తమ దేశం చుట్టూ చైనా సైనిక విన్యాసాలు నిర్వహించడంపై తైవాన్  మండిపడింది. డ్రిల్స్​ను ఖండిస్తూ ఆ దేశ ప్రెసిడెంట్ సాయ్  ఇంగ్ వెన్  తెలిపారు. సైనిక విన్యాసాలను ఎదుర్కొంటామని, అమెరికాతో పాటు కలిసివచ్చే దేశాలతో పనిచేయడం ఆపబోమని స్పష్టంచేశారు. అమెరికాలో పర్యటించిన ఆమె శుక్రవారం తిరిగి తైవాన్​కు చేరుకున్నారు.

తైవాన్  కూడా సన్నద్ధం

చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు తైవాన్  కూడా సిద్ధమవుతోంది. యాంటీ ఎయిర్ క్రాఫ్ట్  మిసైల్ లాంచర్లు, ఫైటర్  జెట్లను తరలిస్తోంది. ‘మా దేశం చుట్టూ చైనా శనివారం 8 యుద్ధనౌకలు, 42 యుద్ధ విమానాలను మోహరించినట్లు గుర్తించాం. చైనా, తైవాన్  మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాలని మేము కోరుకోవట్లేదు. చైనాతో గొడవ పడాలనీ లేదు. అయితే మా దేశ సార్వభౌమాధికారానికి ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఏర్పడితే కచ్చితంగా ఎదుర్కొంటాం’ అని తైవాన్  రక్షణ శాఖ పేర్కొంది. చైనా దుందుడుకు చర్యలను ఖండించింది.