5జీతో ప్రయోగాలు చేస్తాం..ఈజీగా పర్మిషన్​ ఇవ్వండి

5జీతో ప్రయోగాలు చేస్తాం..ఈజీగా పర్మిషన్​ ఇవ్వండి

మన ప్రభుత్వాన్ని కోరిన హువావే

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 5జీ సేవల కోసం ప్రయోగాలు చేయడానికి తమకు అనుమతి ఇచ్చే విషయంలో స్వేచ్ఛగా, పూర్తి సమాచారంతో నిర్ణయం తీసుకోవాలని చైనా టెలికం కంపెనీ హువావే కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అమెరికాలో ఇది 5జీ సేవలను అందించకుండా అక్కడి ప్రభుత్వం నిషేధించింది. భద్రతా కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. హువావే పరికరాలను వాడొద్దని ఇతర దేశాలపైనా ఒత్తిడి తెస్తోంది. ఈ విషయంలో ఇండియా మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. వంద రోజుల్లోపే 5జీ ట్రయల్స్‌‌‌‌ నిర్వహిస్తామని గతంలోనూ ప్రకటించింది. ‘‘తమ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లను, డేటాను తమ సొంత విధానాల ద్వారా రక్షించుకునే విషయంలో ఇండియా అయినా ఇతర ఏ దేశమైనా స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కేవలం భయంతో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. ఆధారాలు, వాస్తవాల ఆధారంగా సైబర్‌‌‌‌ సెక్యూరిటీ సమస్యలను పరిష్కరించుకోవాలి’’ అని హువావే పేర్కొంది. 5జీ ట్రయల్స్‌‌‌‌కు సంబంధించి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర టెలికం మంత్రి రవిశంకర్‌‌‌‌ ప్రసాద్ గత నెల ప్రకటించారు. దీనిపై చైనా ప్రభుత్వం స్పందిస్తూ అమెరికా ఒత్తిడికి లొంగి నిర్ణయం తీసుకోకూడదని, స్వతంత్రంగా వ్యవహరించాలని సూచించింది. 5జీ ట్రయల్స్‌‌‌‌ గత కొన్ని నెలలుగా ఇండియాతో జరిపిన చర్చలు సానుకూలంగా ముగిశాయని, అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా నిర్ణయం తీసుకుంటుందని హువావే ఆశాభావం వ్యక్తం చేసింది.   ప్రస్తుతం సంవత్సరంలో 5జీతోపాటు ఇతర రేడియో తరంగాలకు అవసరమైన స్పెక్ట్రం అమ్మకానికి వేలం నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తమ దగ్గర తగినంత స్పెక్ట్రం ఉందని, రాబోయే వంద రోజుల్లోపు 5జీ సేవల ప్రారంభానికి ట్రయల్స్‌‌‌‌ కూడా నిర్వహిస్తామని టెలికంశాఖ మంత్రి రవిశంకర్‌‌‌‌ ప్రసాద్ గతనెల  ప్రకటించారు. చైనా టెలికం కంపెనీని హువావేను 5జీ ట్రయల్స్‌‌‌‌కు అనుమతిస్తారా ? అనే ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయంలో చిక్కుముడులు ఉన్నాయని, భద్రతాకోణంలో ఈ అంశాన్ని పరిశీలిస్తామని రవిశంకర్​ ప్రసాద్​ అన్నారు.